న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశంలో కొనసాగుతున్న పరువు హత్యలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. వేరే కులానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడటం లేదా కులాంతర వివాహాలు చేసుకొన్న కారణంగా ఏటా వందల మంది హ్యతకు గురవుతున్నారని పేర్కొన్నారు. తమ ఇష్టాలకు వ్యతిరేకంగా పిల్లలు పెండ్లి చేసుకొన్నారని కుటుంబసభ్యులు ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలో జరిగిన మాజీ అటార్నీ జనరల్ అశోక్ దేశాయ్ స్మారక కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘నైతికత, చట్టంతో పరస్పర సంబంధం’పై మాట్లాడుతూ పరువు హత్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1991లో ఉత్తరప్రదేశ్‌లో పరువు హత్యకు గురైన ఓ ఘటనకు సంబంధించి అమెరికా మ్యాగజైన్లో ప్రచురితమైన ఓ ఆర్టికల్‌ను సీజేఐ ప్రస్తావించారు. తక్కువ కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందన్న కారణంతో 15 ఏండ్ల బాలికను గ్రామానికి చెందిన అగ్రకులాల వ్యక్తులు దారుణంగా హత్యచేసిన ఉదంతాన్ని వివరించారు.
నైతికత చాలా ముఖ్యం
చట్టం బయటకు కనిపించే విషయాలను నియంత్రించగలిగితే, అంతర్గత జీవితంలో పాటు విపరీత చర్యలను నైతికత నియంత్రిస్తుందని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. నైతికత ఎల్లప్పుడూ మన మనసాక్షిని తడుతూ ఉంటుందని, అదేవిధంగా ఎలా వ్యవహరించాలో మార్గనిర్దేశం చేస్తుందని అన్నారు. ‘నైతికత అనేది జీవితంలో ప్రవర్తనా నియమావళితో కూడిన విలువలతో కూడిన వ్యవస్థ అని మనమందరం అంగీకరిస్తాం. అయితే ఇదే సమయంలో అసలు నైతికత అంటే ఏమిటో ప్రాథమికంగా అంగీకరిస్తున్నామా? అంటే నాకు ఒకటి నైతికత అని అనిపిస్తే.. అది నీకు కూడా నైతికత అనిపించాల్సిన అవసరం ఉన్నదా?’ అని ప్రశ్నించారు.
అనాదిగా అణచివేత
అధిపత్య గ్రూపుల చేతిలో నిమ్నకులాల వారు అవమానాలు, దాడులు, దోపిడీకి గురవుతున్నారని జస్టిస్ చంద్రచూడ్ విచారం వ్యక్తం చేశారు. దాడుల ద్వారా బలహీనవర్గాల ప్రజలు ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోకుండా అడ్డుకుంటున్నారని ఎత్తిచూపారు. దళిత సమాజాన్ని దూరంగా పెట్టేందుకు ఆధిపత్య కులాలు ఉపయోగించే సాధనాల్లో దుస్తులు ఒకటని ఉదాహరణగా చూపుతానని వివరించారు. దళితులను గుర్తించేందుకు తక్కువ స్థాయికి చెందిన వాటిని తప్పకుండా ధరించాలనేది విస్తృతంగా వ్యాపింపజేసిన ఒక నియమమని అన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత కూడా అధిపత్య కులాలకు చెందిన నైతికతనే ‘తగిన నైతికత’గా చట్టం ఎలా విధిస్తున్నదనేదానిపై సీజేఐ మాట్లాడుతూ.. ‘మన పార్లమెంటరీ వ్యవస్థలో మెజార్టీ ద్వారా చట్టాలు రూపొందిస్తారు. తద్వారా ప్రజానైతికతకు సంబంధించిన చర్చ అనేది మెజార్టీచే రూపొందించబడిన ఆ చట్టం మార్గంలోనే ఉంటుందని, నైతిక ఆందోళనలు, పక్షపాతాలు చట్టాల్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. సాధారణ నైతికత పేరుతో ఆధిపత్య గ్రూపుల సామాజిక నైతికతను ఎదుర్కోవడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలపై చర్చ మళ్లాలని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ హక్కులు సామాజిక ఆధిపత్య నైతికతతో నిర్వీర్యం కావని స్పష్టం చేశారు.