NDA | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 16: నమస్తే తెలంగాణ: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సోమవారానికి వంద రోజులు పూర్తయ్యాయి. గడిచిన పదేండ్లలో కనిపించిన దూకుడు ఇప్పటి ఎన్డీఏ 3.0 సర్కారులో కనిపించట్లేదన్నది కాదనలేని సత్యం. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో సీట్లు తగ్గిపోయిన ప్రభావమో, మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతుండటం వల్లనో కానీ ఏదైనా నిర్ణయంపై వ్యతిరేకత వస్తే ఎన్డీఏ ప్రభుత్వం పీఛేముడ్ అంటున్నది. ధరల నియంత్రణ, ఉద్యోగాల కల్పన, బడ్జెట్ విషయంలోనూ సర్కారు తన మార్క్‌ను చూపించలేకపోయింది. వెరసి ఎన్డీఏ 3.0 వంద రోజుల పాలనలో ఎలాంటి మెరుపులు కనిపించకపోయినా.. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్న భయం మాత్రం కనిపిస్తున్నదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఎక్కడ అసమ్మతి వచ్చినా మొగ్గలోనే తుంచేయడం లేదా వ్యతిరేకించిన వారిని పక్కనపెట్టడమే పాలసీగా ఇప్పటివరకూ అనుసరించిన ప్రధాని మోదీ తన వైఖరిని మార్చుకొన్నట్టు కనిపిస్తున్నది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాను వెనక్కి తీసుకోవడం ఇందులో భాగమే. అంతేకాదు. గడిచిన పదేండ్లలో సొంతమెజార్టీ ఉండటంతో మిత్రపక్షాలను లెక్కచేయని ప్రధాని మోదీ.. ఇప్పటి సంకీర్ణ సర్కారుకు కీలకంగా మారిన బీహార్, ఏపీకి బడ్జెట్లో పెద్దయెత్తున నిధులను మంజూరు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎన్డీఏ మిత్రులను సంతోషపెట్టి, సంకీర్ణ సర్కారును కాపాడుకోవడానికే మోదీ ఇలా చేశారని విశ్లేషకులు చెప్తున్నారు.