జైపూర్, మే 8: రాజస్థాన్లో భారీగా లిథియం నిక్షేపాలను గుర్తించారు. నాగౌర్ జిల్లాలోని డెగానా, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నిక్షేపాలు ఉన్నట్టు జీఎస్ఐ అధికారులు కనుగొన్నారు. అత్యంత అరుదుగా లభించే ఈ ఖనిజాన్ని దేశంలో తొలిసారిగా జమ్ముకశ్మీర్లో కనుగొన్నారు. రాజస్థాన్లో గుర్తించిన లిథియం నిల్వలు దేశ అవసరాల్లో దాదాపు 80 శాతం వరకు సరిపడా ఉన్నాయని అధికారులు చెప్పారు.
అంతేగాక కశ్మీర్లో గుర్తించిన నిల్వలతో పోల్చితే చాలా అధికమని తెలిపారు. బ్యాటరీల తయారీలో, సెల్ఫోన్, ల్యాప్టాప్, ఎలక్ట్రికల్ వాహనాల తయారీలో లిథియాన్ని ఎక్కువగా వాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా గుర్తించిన నిల్వల కారణంగా దిగుమతి భారం తగ్గనున్నది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఒక టన్ను లిథియం ధర దాదాపు రూ.58 లక్షల వరకు ఉన్నది.