Price Hike | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వేసవి రాగానే కూరగాయల ధరలు పెరగడం.. వర్షాకాలం మొదలుకాగానే తగ్గటం మామూలే. కానీ ఈ ఏడాది అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నది. ఎండాకాలంలో ధరలు అంతంత మాత్రంగానే పెరిగినా వర్షాకాలం మొదట్లో రేట్లు అమాంతం కొండెకాయి. ఈ విపరీత పరిస్థితి సామాన్యులకు భారంగా మారింది. ప్రస్తుతం దాదాపు కూరగాయలన్నీ కిలో రూ.80 వరకు పలుకుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఉల్లి, టమాట సహా అన్ని కూరగాయల ధరలు 60 శాతం వరకు పెరిగాయి.
మే నెల మూడో వారంలో కిలో రూ.20 పలికిన ఉల్లి.. ప్రస్తుతం రూ.50కి చేరింది. ఇక, టమాటా ధర కూడా రెండింతలు పెరిగి, ప్రస్తుతం కిలో రూ.50కిపైగా పలుకుతున్నది. ఇక వంకాయలు, బీన్స్, క్యారట్ ఇతర కూరగాయలతో సహా ఆకుకూరల ధరలు కూడా భారీగా పెరిగాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా సరిపడా ఉల్లి మార్కెట్‌కు రాకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో హైదరాబాద్‌కు రోజూ 8 వేల క్వింటాళ్ల ఉల్లిగడ్డ వస్తే ప్రస్తుతం 5 వేల క్వింటాళ్ల వరకే వస్తున్నది. ధరలు తగ్గించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలను అమలు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. డిమాండ్‌ను అంచనా వేసి ఆ మేరకు నిల్వలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గత నెల బావుల, బోర్ల కింద కూరగాయాల పంటలు వేశారని, ఆ పంట దిగుబడి మొదలైతే, వచ్చే రెండు నెలల్లో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ జనాభాకు ప్రతి ఏడాది 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరమవుతాయని ఒక అంచనా. అయితే ప్రస్తుతం 19.54 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్రంలో 1.30 కోట్లకు పైగా ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతున్నాయి. అందులో కూరగాయల పంటలు 3.11 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. ఈ కారణంగా జనాభా అవసరాలను సుమారు 19 లక్షల టన్నుల దిగుబడుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తున్నది.
హైదరాబాద్, జూన్ 14 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్ర మోదీ అసమర్థ విధానాలు, అనాలోచిత నిర్ణయాలతో సామాన్యుడిపై ధరాఘాతం పెను ప్రభావం చూపిస్తున్నది. వంట గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ పెంపుతో ప్రజలు ఒకవైపు అల్లాడిపోతుంటే.. నిత్యావసరాల ధరలు వారిపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. దీన్ని రుజువు చేస్తూ.. మే నెలలో టోకు ద్రవ్యోల్బణం 2.61 శాతానికి పెరిగింది. గడిచిన 15 నెలల వ్యవధిలో ఇదే గరిష్ఠం. ఈ మేరకు కేంద్రప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తున్నది.
అరకొర సంపాదనతో బతుకుబండి లాగిస్తున్న సామాన్యులకు టీవోపీ (టమాట-ఆనియన్ (ఉల్లిగడ్డ)-పొటాటో (ఆలుగడ్డ)) ధరలు ఆకాశాన్నంటడం నిద్రలేకుండా చేస్తున్నది. వంటకు ప్రధానమైన ఈ మూడు కూరగాయల ధరలు అమాంతం పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ అదుపుతప్పుతున్నది. ఈ నెలలోనే ఉల్లిగడ్డల ధరలు 21 శాతం, టమాటా ధరలు 36 శాతం, ఆలుగడ్డల ధరలు 20 శాతం, వంట నూనెల ధరలు 15 శాతం పెరిగినట్టు క్వాంట్ఈకో రీసెర్చ్ సంస్థ తెలిపింది. ‘వడగాలులు, అకాల వర్షాల నేపథ్యంలో ఉల్లి, టమాట దిగుబడిపై ప్రభావం పడింది. దీంతో మార్కెట్లోకి వచ్చే ఉల్లి, టమాట దిగుబడి భారీగా తగ్గిపోయింది.
వచ్చేది పండుగల సీజన్. దీన్ని దృష్టిలో పెట్టుకొన్న రైతులు.. తమ పంటను విపణిలోకి తీసుకురావడాన్ని ఆలస్యం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎక్కువ ధర వస్తుందనే వాళ్లు ఇలా చేస్తున్నారు. వెరసి డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో టమాట, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల ధరలు భారీగా పెరుగుతున్నాయి’ అని క్వాంట్ఈకో రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. టీవోపీ ధరలు ప్రతీనెలా 5.2 శాతం మేర పెరుగుతున్నట్టు హెడీఎఫ్సీ బ్యాంక్ ఇటీవల ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇదే సమయంలో ప్రతీనెలా పప్పు దినుసులు 1.7 శాతం మేర పెరుగుతున్నట్టు వివరించింది. నిత్యావసరాల ధరలను కట్టడి చేయడంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఆ భారం తమపై పడుతున్నదని మోదీ సర్కారుపై సామాన్యులు మండిపడుతున్నారు.
ఈసారి వేసవిలో స్థానికంగా కూరగాయల ఉత్పత్తి 20 శాతం వరకు తగ్గింది. డిమాండ్‌ను బట్టి వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దయెత్తున దిగుమతి చేసుకున్నారు. అందుకే మే వరకు ధరలు దాదాపు అదుపులోనే ఉన్నాయి. ఈ నెల మొదటి వారంలో వర్షాలు మొదలయ్యాక సమస్యలు ప్రారంభమయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సమయంలో వర్షాలు పడడం వల్ల అవి తడిసిపోవడం, కుళ్లిపోవడం వంటి పరిణామాల దృష్ట్యా కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. హైదరాబాద్ నగర జనాభాకు ప్రతి రోజు దాదాపు 3,300 టన్నుల కూరగాయల అవరసం ఉంటుంది. కానీ వారం రోజులుగా అన్ని హోల్‌సేల్ మారెట్లకు 2,800 టన్నుల సరకు మాత్రమే వస్తున్నది. మరోవైపు ధరలు పెరిగిన నేపథ్యంలో కొనుగోళ్లు పెద్దగా జరుగడం లేదని, దీంతో ఉన్న సరుకు పాడైపోయి, పెట్టుబడి కూడా రావడం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘2024 మే నెలలో ఆహార పదార్థాలు, ఆహార ఉత్పత్తుల తయారీ, ముడి చమురు, సహజ వాయువు, నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ ప్రభావం నిత్యావసరాలు, కూరగాయలపై పడింది. ఫలితంగా టోకు ద్రవ్యోల్బణం 2.61 శాతానికి పెరిగింది.
– కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ