ముంబై: ప్రముఖ విద్యా సంస్థ క్యాంపస్‌లో భారీ మొసలి కనిపించింది. (Crocodile In IIT-Bombay Campus) స్థానికంగా ఉన్న సరస్సు నుంచి అది బయటకు వచ్చింది. క్యాంపస్‌లోని రోడ్డుపై సంచరించింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ప్రముఖ విద్యా సంస్థ అయిన ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఆదివారం రాత్రి వేళ భారీ మొసలి కనిపించింది. దీంతో దానిని చూసి విద్యార్థులు, స్థానికులు భయాందోళన చెందారు.
కాగా, ఈ విషయం తెలిసి పోలీసులు, జంతు ప్రేమికులు అక్కడకు చేరుకున్నారు. ఆ మొసలి వల్ల ఎవరికీ ఏమీ జరుగకుండా చూశారు. ఆ తర్వాత స్థానిక పొవై సరస్సులోకి అది వెళ్లినట్లు జంతు రక్షకులు తెలిపారు. అది ఆ సరస్సు నుంచి బయటకు వచ్చి ఉంటుందని అంచనా వేశారు. ఆడ మొసలి అయిన అది గుడ్లు పెట్టేందుకు తగిన స్థలం కోసం వెతుకుతున్నట్లు భావించారు.
మరోవైపు ప్రజలు భయాందోళన చెందవద్దని జంతు రక్షకులు తెలిపారు. అయితే మొసళ్ల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మొసళ్ల ఉనికి ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. కాగా, ఐఐటీ బాంబే క్యాంపస్ రోడ్డులో భారీ మొసలి సంచరించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A crocodile drifted its way from Powai Lake into IIT situated Padmavati Devi temple today. Source: Powai COP Group, posted by a Powaiite. Further details awaited. pic.twitter.com/9eG6AiPxwD
— Planet Powai (@PlanetPowai) March 24, 2025