Kisan Credit Card | బడ్జెట్లో రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని పెంచింది. ప్రస్తుతం రూ.3లక్షలుగా ఉన్న ఈ పరిమితిని.. రూ.5లక్షల వరకు పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని 1998లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రెడిట్ కార్డులను ఉపయోగించుకుని వ్యవసాయం సహా మత్స్య, పశుసంవర్థక రంగాల్లో స్వల్పకాలిక రుణాన్ని పొందవచ్చు. ఈ కార్డుల ద్వారా వ్యవసాయ సహా ఇతర అనుబంధ కార్యకలాపాలైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల కొనుగోలు, కూలీల ఖర్చు, పంట కోత ఖర్చులు వంటి అవసరాల కోసం ఈ కార్డు ద్వారా లోన్ తీసుకోవచ్చు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులతో బీమా సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో పొందవచ్చు.
ఆఫ్‌లైన్‌లో కిసాన్ క్రెడిట్ కార్డు ఎలా పొందాలంటే..
– కిసాన్ క్రెడిట్ కార్డు కావాలనుకునే రైతులు.. తమ అకౌంట్ ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేటు బ్యాంకును సంప్రదించాలి. అక్కడ కిసాన్ క్రెడిట్ కార్డు దరఖాస్తు ఫారమ్ తీసుకుని.. అందులో పేర్కొన్న వివరాలను నమోదు చేయాలి. ఐడీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్‌పోర్టుల్లో ఏదో ఒకటి చూపించాలి. దీనితో పాటు పాస్‌పోర్టు సైజ్ ఫొటో, వ్యవసాయ భూమి పత్రాలను ఆ దరఖాస్తు ఫారమ్‌కు జత చేసి బ్యాంకులో సమర్పించాలి. అప్పుడు సంబంధింత బ్యాంకులు ఆ వివరాలను సరిచూసుకుని.. ఐదేళ్ల కాలపరిమితితో కూడిన కిసాన్ క్రెడిట్ కార్డును మంజూరు చేస్తుంది.
ఆన్లైన్లో ఎలా..
ఆన్లైన్లో కిసాన్ క్రెడిట్ కార్డు పొందాలంటే ముందుగా సంబంధిత బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో రుణాలకు సంబంధించిన ఆప్షన్ ఎంచుకుని.. అందులో కిసాన్ క్రెడిట్ కార్డు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పూర్తయిన తర్వాత ఒక రిఫరెన్స్ నంబర్‌ను పొందుతారు. దాన్ని ఆధారంగా కార్డు స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.