కరోనా సెకండ్ వేవ్ సమయంలో యూపీ, బిహార్ గంగా నదిలో అనేక శవాలు కుప్పలు కుప్పలుగా తేలాయి. ఈ విషయం గుర్తుందా? మళ్లీ ఇప్పుడు ఈ విషయం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్గా తీసుకుంది. ఆ సమయంలో అసలు ఎన్ని శవాలు గంగా నదిలో తేలాయి? వెంటనే లెక్కలు చెప్పండి? అంటూ ఇరు రాష్ట్రాలను గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది.
జస్టిస్ అరుణ్ కుమార్ త్యాగీ, ఎన్జీటీ సభ్యుడు డాక్టర్ అఫ్రోజ్ అహ్మద్ ధర్మాసనం దీనిపై ఇరు రాష్ట్రాలను వివరణ కోరింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శి, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శులను ఆదేశించింది.
కోవిడ్ ప్రారంభమైన సమయం నుంచి మొదలు పెడితే, 2020,2021 సంవత్సరాలు, ఈ యేడాది మార్చి 31 వరకూ ఎన్ని కోవిడ్ శవాలు గంగలో తేలాయో లెక్కలు చెప్పాలని తాఖీదులు పంపింది. అంతేకాకుండా కోవిడ్ శవాలను కాల్చడానికి ఎంత మందికి ఆర్థిక సహాయం చేశారో కూడా చెప్పాలని ఎన్జీటీ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది.