Manmohan Singh | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అతి సాధారణ కుటుంబంలో జన్మించిన మన్మోహన్.. దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ప్రధానిగా పదేళ్లు సేవలందించారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకూ ప్రధానిగా పనిచేశారు. ఇక 33 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. మన్మోహన్ భారత ఆర్థిక విధానాలపై చెరనగి ముద్ర వేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి భారత్‌ను గట్టెక్కించడమే కాకుండా, ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దేశాన్ని నిలిపారు.
1991లో దేశం కఠినమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా ఎన్నికైన పీవీ నరసింహారావు (PV Narasimha Rao).. ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న మన్మోహన్ సింగ్‌కు అనూహ్యంగా తన క్యాబినెట్లో చోటు కల్పించి ఆర్థిక మంత్రిని చేశారు. బ్యాంకింగ్ రంగంలో అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టిన మన్మోహన్సింగ్ భుజాలపై దుర్భర స్థితిలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరిచే బాధ్యతను ఉంచారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి పెద్ద మార్పులు తీసుకురావడానికి మన్మోహన్‌సింగ్‌కు పీవీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అప్పటి నుంచి వారిద్దరూ కలిసి దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు. 1991 లో (1991 Union Budget) ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆయన తొలి బడ్జెట్‌ను గేమ్ ఛేంజర్ బడ్జెట్ అని పిలుస్తారు.
దిగుమతి-ఎగుమతి విధానాన్ని మార్చడం ద్వారా మన్మోహన్సింగ్ భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి తెరిచారు. ఈ బడ్జెట్ కారణంగా, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఊపందుకున్నది. దేశంలో ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లేందుకు బ్లూప్రింట్ సిద్ధం చేయబడింది. దీనికి ముందు దేశ ఆర్థిక వ్యవస్థ అనేక కారణాల వల్ల వెనుకబడి ఉన్నది. స్టాక్ మార్కెట్ కుంభకోణాలు, చైనా, పాకిస్తాన్‌తో యుద్ధాలు, దిగుమతుల కోసం సంక్లిష్టమైన లైసెన్సింగ్ వ్యవస్థలు, విదేశీ మూలధన పెట్టుబడులపై ప్రభుత్వ ఆంక్షలు వంటి అనేక అంశాలు ఆర్థిక వ్యవస్థ వృద్ధిని నిలిపివేశాయి.
మన్మోహన్ సింగ్ సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ అనే మూడు విభాగాల్లో కీలక మార్పులు తీసుకొచ్చారు. దాంతో పాటు దిగుమతి-ఎగుమతి విధానంలో మార్పులు చేశారు. దిగుమతి లైసెన్స్ ఫీజు తగ్గించి, ఎగుమతులను ప్రోత్సహించేలా నిర్ణయం తీసుకున్నారు. కస్టమ్ డ్యూటీ 220 శాతం నుంచి 150 శాతానికి తగ్గింది. బ్యాంకులపై ఆర్బీఐ నియంత్రణను తగ్గించారు. డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేటు, రుణ మొత్తాన్ని నిర్ణయించే అధికారం బ్యాంకులకు ఇచ్చారు. దేశంలో బ్యాంకుల విస్తరణకు దారితీసేలీ ప్రైవేట్ బ్యాంకులు ప్రారంభించేందుకు నిబంధనలను సడలించారు. లైసెన్స్ రాజ్‌ను రద్దు చేసింది. దాదాపు 18 పరిశ్రమలు మినహా అందరికీ లైసెన్స్ అవసరాన్ని తొలగించారు. ఈ మార్పులు అంతర్జాతీయ మార్కెట్‌తో నేరుగా భారతీయ పరిశ్రమలకు పోటీకి తలుపులు తెరిచాయి. ఈ సంస్కరణల ఫలితంగా మరుసటి దశాబ్దంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందింది.
Also Read..
Manmohan Singh: మారుతీ 800 కారంటే మన్మోహన్‌కు ఇష్టం !
Manmohan Singh | మన్మోహన్ సింగ్‌కు టీమ్ఇండియా ఘన నివాళి.. నల్ల బ్యాండ్స్‌తో బరిలోకి
Manmohan Singh | శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. ఏడు రోజులు సంతాపదినాలు