న్యూఢిల్లీ: భారత భూభాగంలోని రెండు వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా ఆక్రమించినట్లు రాహుల్ గాంధీ గతంలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానిపై ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) సీరియస్ అయ్యింది. మన భూమిని చైనా ఆక్రమించినట్లు మీకెలా తెలుసు అని కోర్టు అడిగింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాషితో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఇవాళ వాదనలు చేపట్టింది. అయితే క్రిమినల్ పరువునష్టం కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ తన సోషల్ మీడియాలో కొన్ని ఆరోపణలు చేశారు. రెండువేల చదరపు కిలోమీటర్ల నేలను చైనాకు సరెండర్ చేసినట్లు ఆరోపించారు. గల్వాన్ ఘర్షణ తర్వాత ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు ఆయన అన్నారు. ప్రధాని మోదీ, ప్రభుత్వం ఆ భూమిని సరెండర్ చేసినట్లు ఆరోపించారు. అయితే భారత్‌కు చెందిన రెండువేల చదరపు కిలోమీటర్ల నేలను చైనా ఆక్రమించినట్లు మీకు ఎలా తెలుసు అని కోర్టు ప్రశ్నించింది. ఒకవేళ మీరు నిజమైన భారతీయుడే అయితే, మీరు ఇలాంటివి చెప్పేవారు కాదని జస్టిస్ దత్త పేర్కొన్నారు. ఆక్రమణ సమయంలో మీరు అక్కడ ఉన్నారా, లేక మీ దగ్గర ఏదైనా విశ్వసనీయ సమాచారం ఉందా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. ఈ విషయాలను మాట్లాడలేనప్పుడు, అతను ఎలా ప్రతిపక్ష నేత అవుతారని సింఘ్వీ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్లో భారతీయ ఆర్మీని చైనీస్ సైనికులు కొడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ఎందుకు చేస్తున్నారని, ఆ అంశాలను ఎందుకు పార్లమెంట్లో ప్రశ్నించడంలేదని కోర్టు చెప్పింది. 19(1)(ఏ) భావ స్వేచ్ఛ హక్కు ఉంది కదా అని సోషల్ మీడియాలో ప్రశ్నించడం కాదు అని, బోర్డర్ అంశంపై పార్లమెంట్లో ఎందుకు మాట్లాడడం లేదని కోర్టు రాహుల్‌ను నిలదీసింది. రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు వేసి వేధించడం సరికాదు అని సింఘ్వీ అన్నారు. దీంతో క్రిమినల్ ప్రోసీడింగ్స్‌పై సుప్రీం స్టే ఇచ్చింది. మూడు వారాల తర్వాత మళ్లీ ఈ కేసులో వాదనలు జరపనున్నారు.
రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు జారీ చేసింది. దాన్ని అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంను ఆశ్రయించారు. రాహుల్‌పై లాయర్ వివేక్ తివారీ కేసు దాఖలు చేశారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాత్సవ్ తరపున కేసు ఫైలైంది. గల్వాన్ ఘర్షణపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు భారతీయ సైనిక బలగాలను నిర్వీర్యం చేస్తున్నట్లు ఉందని కేసులో ఆరోపించారు.