న్యూఢిల్లీ, నవంబర్ 23: జిల్లాలవారీగా మైనారిటీలను గుర్తించడం సాధ్యమేనా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ డిమాండ్‌ను బట్టి చూస్తే తర్వాత ‘వీధులవారీగా’ మైనారిటీల లెక్కలు తీయాలనే డిమాండూ రావచ్చని పేర్కొన్నది. యూపీలోని కొన్ని జిల్లాల్లో హిందువులే మైనారిటీలుగా ఉన్నారని, అందుకే జిల్లాలవారీగా లెక్కలు తీయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. బీజేపీ నేత, న్యాయవాది అశ్వినికుమార్ ఉపాధ్యాయతో పాటుగా పలువురు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, పార్శీలు, బౌద్ధులను జాతీయ మైనారిటీలుగా గుర్తించడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని పిటిషనర్లు తెలిపారు.
మెజారిటీగా పరిగణించే హిందువులు అనేక రాష్ర్టాల్లో అల్ప సంఖ్యాకులుగా ఉన్నారని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఆధిపత్యం కోల్పోతున్నారని వివరించారు. ముస్లింల శాతాన్ని బట్టి యూపీలోని 20 జిల్లాల్లో వారిని మైనారిటీలుగా పరిగణించలేమని 2021లో అలహాబాద్ హైకోర్టు చెప్పినట్టు ఉపాధ్యాయ కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం 2022లో అలాంటి జిల్లాల సంఖ్య 26కు పెరిగిందని అన్నారు. ఈ దశలో జస్టిస్ కౌల్ జోక్యం చేసుకొంటూ జిల్లావారీగా మైనారిటీ స్థాయిని నిర్ణయించడమా? వీధులవారీగా ఎందుకు లెక్కలు తీయొద్దు? అని చెణుకు వేశారు. ఇదంతా సాధ్యమేనా? అని ప్రశ్నించారు.