న్యూఢిల్లీ: విమానాల్లోని సీట్లలో 11ఏ ప్రాణ రక్షకిగా, పునర్జన్మను ఇచ్చేదిగా మారిందా? రెండు విమాన ప్రమాదాలను పరిశీలించినపుడు ఈ ఆసక్తికర ప్రశ్న ఉదయిస్తుంది. అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిరిండియా ఏఐ-171 విమాన ప్రమాదంలో 11ఏ సీటులో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేశ్ సజీవంగా బయటపడ్డారు. ఈ వార్తను మీడియాలో చూసిన థాయ్ నటుడు, గాయకుడు రువాంగ్‌సక్ లోయ్చుసక్ (47) అవాక్కయ్యారు. 27 ఏండ్ల క్రితం 1998 డిసెంబరు 11న తనకు పునర్జన్మ లభించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆ రోజు ఆయన ప్రయాణించిన థాయ్ ఎయిర్వేస్ ఫ్లైట్ టీజీ261 కిందకు దిగే సమయంలో పట్టు తప్పి, చిత్తడి నేలలో కూరుకుపోయింది. దానిలోని 146 మందిలో 101 మంది మరణించారు. కానీ 11ఏ సీట్లో కూర్చున్న రువాంగ్‌సక్ సజీవంగా బయటపడ్డారు. నాటి ప్రమాదంపై ఆయన మాట్లాడుతూ… విశ్వాస్ కుమార్ రమేశ్ ఏఐ171 విమానంలోని 11ఏ సీట్లో కూర్చున్నట్లు, ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుసుకుని తనకు గగుర్పాటు కలిగిందని చెప్పారు. “భారత దేశంలో జరిగిన విమాన ప్రమాదంలో సజీవంగా బయటపడిన వ్యక్తి నాలాగే 11ఏ సీట్లో కూర్చున్నారు” అని ఆయన ఫేస్బుక్ పోస్ట్‌లో రాశారు.
1998లో తాను ప్రయాణించిన విమానం బోర్డింగ్ పాస్ తన వద్ద లేదని, వార్తా పత్రికలు తన సీటు నంబర్‌ను, తాను సురక్షితంగా బయటపడిన విషయాన్ని రాశాయని తెలిపారు. ఆయన ఈ సంఘటన గురించి, అనేక సంవత్సరాలపాటు తాను అనుభవించిన భయం గురించి చాలాసార్లు చెప్పారు. తనకు పునర్జన్మ లభించిందని చెప్పేవారు. ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించినవారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన దాదాపు పదేండ్ల పాటు విమాన ప్రయాణాలు చేయలేదని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.