Congress Leader Joins BJP | కర్ణాటక మాజీ మంత్రి ప్రమోద్ మధ్వారాజ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే బీజేపీలో చేరారు. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై సమక్షంలో పలువురు నేతలతో కలిసి శనివారం బీజేపీలో చేరారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పేరుతో ప్రమోద్ మధ్వారాజ్ రాజీనామా లేఖ రాశారు.
కర్ణాటక పీసీసీలో ఉపాధ్యక్ష పదవిని ఆమోదించడానికి సిద్ధంగా లేనని, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో తెలిపారు. గత మూడేండ్లుగా ఉడిపి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, పార్టీలో తనకు ఊపిరాడకుండా చేశారని ఆరోపించారు. పార్టీ ఇతర నేతల తీరును తమ దృష్టికి తేవడం కోసమే ఈ అంశాలు ప్రస్తావించానన్నారు.
ఉడిపి జిల్లాలో పార్టీ పరిస్థితిపై తాను లేవనెత్తిన అంశాల పరిష్కారానికి పార్టీ నాయకత్వం చర్య తీసుకోలేదని మధ్వారాజ్ ఆరోపించారు. విశ్వేశ థీర్ఘ స్వామీజీకి మరణం తర్వాత పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించినందుకు ప్రధాని నరేంద్రమోదీని ప్రశంసించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పద్మ అవార్డులను నిర్ణయించే ప్రక్రియ మారిపోయిందన్నారు.