Supreme Court : శిశువుల అక్రమ రవాణా (Newborn trafficked) కేసుల విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (UttarPradesh government) వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఏ ఆస్పత్రిలోనైనా శిశువుల అక్రమ రవాణా జరిగినట్లు తేలితే లైసెన్స్ రద్దు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అంతేగాక శిశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రభుత్వానికి కఠిన మార్గదర్శకాలు ఇచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఒక ఆస్పత్రిలో నవజాత శిశువు చోరీకి గురయ్యాడు. దాంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఆ శిశువును విక్రయించిన దుండగుడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన దంపతులకు నిరాశే మిగిలింది. కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.
దాంతో తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ.. బాధిత దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం విచారించింది. చిన్నారుల అక్రమ రవాణా కేసులపై యూపీ ప్రభుత్వ తీరుపైన, నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన అలహాబాద్ హైకోర్టుపైన సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. అక్రమ రవాణాకు సంబంధించిన పెండింగ్ కేసుల విచారణ దేశవ్యాప్తంగా ఎలా కొనసాగుతోందో తెలియజేయాలని హైకోర్టులను ఆదేశించింది.
అంతేగాక నిందితుడి బెయిల్‌ను రద్దు చేసింది. శిశువుల అక్రమ రవాణా కేసులకు సంబంధించిన విచారణను 6 నెలలలోపు పూర్తిచేయాలని, రోజూవారీ విచారణను కూడా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఏ ఆస్పత్రిలోనైనా శిశువుల అక్రమ రవాణా జరిగినట్లు తేలితే లైసెన్స్ రద్దు చేయాలని ఆర్డర్ వేసింది. నిందితులను సకాలంలో పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.