Election Commission | న్యూఢిల్లీ: భారత ఎన్నికల కమిషన్ (ఈసీ)పై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతున్నది. అంతేకాదు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) వల్ల తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి దాపురించిందని పేదలు, అణగారిన వర్గాల ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. లోక్‌నీతి-సీఎస్డీఎస్ తాజా సర్వేలో ఈ అంశాలు వెలుగు చూశాయి. “పత్రాలు లేకపోవడం వల్ల పేదలు ఓటు హక్కును కోల్పోవడం, ఎన్నికల కమిషన్‌పై నమ్మకం సడలిపోవడం జరిగే అవకాశాలు” పేరుతో ఈ అధ్యయనం జరిగింది. దీని ప్రకారం, రకరకాల గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను కోరడం సంపన్న పౌరులకు ‘సమంజసమైనది’గానే కనిపించవచ్చు. కానీ, అతి తక్కువ వనరులు గల వారి విషయంలో ఇది తీవ్రమైన అడ్డంకులను సృష్టిస్తుంది. పేదలు, నిరక్షరాస్యులు, గ్రామీణ లేదా సాంఘికంగా వెనుకబడిన వర్గాల ప్రజల్లో అత్యధికులకు ఈ ప్రక్రియ పెను భారంగా, శాపంగా పరిణమిస్తుంది.
ఈసీపై తగ్గుతున్న నమ్మకం
ఎన్నికల కమిషన్‌పై ప్రజలకు నమ్మకం తగ్గిపోతున్నదని ఈ సర్వేలో వెల్లడైంది. ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్ల జాబితాల నుంచి అర్హులైన ఓటర్లను తప్పుడు పద్ధతుల్లో తొలగించే అవకాశం ఉందని ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 45 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ఉత్తర ప్రదేశ్‌లో 56 శాతం మంది తమకు ఈసీపై అత్యధిక నమ్మకం ఉందని చెప్పారు. వీరి సంఖ్య 2025లో 31 శాతానికి తగ్గిపోయింది. పశ్చిమ బెంగాల్లో ఇది 68 శాతం నుంచి 41 శాతానికి తగ్గింది. అస్సాం, కేరళ, మధ్య ప్రదేశ్లలో పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. అర్హులైన ఓటర్ల పేర్లు నూటికి నూరు శాతం ఓటర్ల జాబితాలో ఉంటాయని తమకు చాలా నమ్మకం ఉందని మూడింట ఒక వంతు మంది మాత్రమే చెప్పారు. దీనివల్ల ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయత దెబ్బతింటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
పత్రాల అందుబాటులో అసమానతలు
గుర్తింపు పత్రాలు అన్ని వర్గాల ప్రజలకు ఒకే విధంగా అందుబాటులో ఉండటం లేదు. సామాజిక వర్గాలు, ధనికులు, పేదల మధ్య చాలా అసమానతలు ఉన్నాయి. ఆధార్ కవరేజ్ దాదాపు సార్వత్రికంగా, సార్వజనీనంగా ఉంది. కానీ ఇతర గుర్తింపు కార్డులను పొందడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పాన్ కార్డు విషయానికి వస్తే, జనరల్ కేటగిరీలోని ప్రతి పది మందిలో తొమ్మిది మంది తమకు పాన్ కార్డు ఉందని చెప్పారు. కానీ ఎస్సీ, ఎస్టీల్లో కేవలం సగానికిపైగా మాత్రమే పాన్ కార్డులు కలవారు ఉన్నారు. పాస్‌పోర్టులు ఉన్నవారు జనరల్ కేటగిరీలో ప్రతి ఐదుగురిలో ఒకరు కాగా, ఎస్సీల్లో ఐదు శాతం మందికి, ఎస్టీల్లో నాలుగు శాతం మందికి మాత్రమే పాస్‌పోర్టులు ఉన్నాయి. జనన ధ్రువీకరణ పత్రాలు ఎస్సీల్లో ప్రతి నలుగురిలో ఒకరికి మాత్రమే ఉన్నాయి. ఇతర కులాల్లో దాదాపు సగం మందికి ఉన్నాయి. అత్యధిక ఆదాయం గల వారిలో దాదాపు సగం మందికి పాస్‌పోర్టులు ఉన్నాయి, పేదల్లో ప్రతి 20 మందిలో ఒకరికి మాత్రమే ఇవి ఉన్నాయి.
మరో సర్వేలో ఆందోళనకర విషయాలు
లోక్‌నీతి-సీఎస్డీఎస్ కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన వేరొక సర్వే నివేదిక ప్రకారం, సుప్రీంకోర్టు, పార్లమెంటు సహా భారతీయ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం క్షీణిస్తున్నది. పార్లమెంటు, రాజకీయ పార్టీలపై ప్రజల విశ్వాసం బలహీనపడిందని వెల్లడైంది. రాజకీయ ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఈసీపై ప్రజల నమ్మకం దారుణంగా పతనమైనట్లు ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయన్నారు.