చెన్నై: ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ కరూర్‌లో (Karur Stampede) నిర్వహించిన భారీ బహిరంగ సభలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. సుమారు లక్ష మందికిపైగా కిక్కిరిసిన సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో ఇప్పటివరకు 39 మంది మరణించారు. వీరిలో 8 మంది చిన్నారులు, 16 మందికిపైగా మహిళలు ఉన్నారు. మరో 400 మందికిపైగా దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. సీఎం స్టాలిన్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. తొక్కిసలాటకు దారితీసన విషయమై ఆరాతీశారు. అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు. దవాఖానల్లో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ శుక్రవారం ఉదయం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.
కాగా, తమిళనాడు చరిత్రలో ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదని సీఎం స్టాలిన్ అన్నారు. ఇప్పటివరకు 39 మంది మరణించారని చెప్పారు. ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారని వెల్లడించారు. ప్రస్తుతం 51 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఇస్తామని చెప్పారు. ఈ ఘటనపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయితే తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తయిందని లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ డేవిడ్సన్ దేవసిర్వతమ్ చెప్పారు. 39 మంది చనిపోయారని, కేసు నమోదుచేశామని వెల్లడించారు.
విజయ్ రాక కోసం కార్యకర్తలు, అభిమానులు ఆరు గంటలకు పైగా ఎదురు చూస్తుండగా విజయ్ ఎట్టకేలకు ప్రత్యేక బస్‌లో వచ్చి దానిపై నుంచి ప్రసంగించడానికి ఉద్యుక్తుడు కావడంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్న సమయంలో జనసమూహం పెద్దయెత్తున పెరిగిపోయి అదుపు తప్పింది. అప్పటికే వందలాది మంది గాయపడ్డారు. చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితిని గమనించిన కార్యకర్తలు నిర్వాహకులను అప్రమత్తం చేయడంతో విజయ్ తన ప్రసంగాన్ని ఆపారు. అయితే అన్ని వేల మంది జనాన్ని దాటుకుని అంబులెన్స్‌లు రావడం కష్టమైంది. గాయపడిన వారిని అతి కష్టం మీద దవాఖానలకు తరలించారు.
తమిళ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ శనివారం మధ్యాహ్నానికి కరూర్ చేరుకోవాల్సి ఉండగా ఆరు గంటలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది. అప్పటికే లక్ష మందికి పైగా జనం అక్కడ విజయ్ కోసం వేచి చూస్తున్నారు. ఆ ప్రదేశం జనంతో కిక్కిరిసిపోవడంతో పలువురు అప్పటికే స్పృహ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇంతలో ఓ 9 ఏండ్ల బాలిక కనిపించడం లేదని ఆ బాలిక కుటుంబ సభ్యులు రోదిస్తూ వెదకడం మొదలుపెట్టారు. దీంతో అక్కడ ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అభిమానులు విజయ్‌ని చూసేందుకు బస్సువైపుకు రావడంతో తొక్కిసలాట జరిగింది.
అప్పటికే గంటల కొద్దీ ఎండలో వేచి ఉన్న ప్రజలను చూసి విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేసి బస్సుపై నుంచి వాటర్ బాటిల్స్‌ని వారిపైకి విసిరారు. బస్సు వైపు దూసుకురావడానికి అభిమానులు కొందరు ప్రయత్నించడంతో అక్కడ కూడా గందరగోళం ఏర్పడింది. జనాన్ని కంట్రోల్ చేయాలంటూ విజయ్ పదేపదే భద్రతా సిబ్బందికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. పోలీస్ ప్లీజ్ హెల్ప్ అంటూ విజయ్ పోలీసులకు పదే పదే విజ్ఞప్తి చేశారు. తొక్కిసలాటలో 30 మంది స్పృహ తప్పి పడిపోయారని అధికారులు తెలిపారు. అతి కష్టం మీద అంబులెన్సులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని దవాఖానలకు తరలించాయి.