Sirens | న్యూఢిల్లీ : ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ – పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు భారత సైన్యం సైరన్లు మోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పౌరులను అప్రమత్తం చేసేందుకు వినియోగించే సైరన్లను వార్తా ప్రసారాల్లో ఉపయోగించొద్దని మీడియా చానెల్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేవలం మాక్ డ్రిల్‌ల సమయంలో మాత్రమే ప్రజలకు అవగాహన కల్పించడం కోసం సైరన్లు మోగించాలని ఆదేశించింది.
టీవీ ప్రసారాల్లో తరచుగా సైరన్లు మోగించడం వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని కేంద్రం పేర్కొంది. దీంతో వాస్తవంగా అత్యవసర సమయాల్లో సైరన్లు మోగించినప్పుడు ప్రజలు వీటిని తేలికగా తీసుకునే ప్రమాదం ఉందని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ విభాగాలు ఆదేశాలు జారీ చేశాయి.