న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, ముంబై మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై పెద్ద గుంత ఏర్పడింది. (hole in highway) అయితే ఎలుకలు తవ్వడం వల్ల ఆ గుంత ఏర్పడినట్లు సంబంధిత రోడ్డు కాంట్రాక్ట్‌కు చెందిన ఉద్యోగి ఆరోపించాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో అతడ్ని తొలగించారు. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఈ రహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడింది. అయితే ఎలుకలు లేదా చిన్న జంతువులు తవ్వడంతో ఈ గుంత ఏర్పడినట్లు అక్కడ రోడ్డు నిర్మించిన కాంట్రాక్ట్ సంస్థకు చెందిన జూనియర్ మేనేజర్ మీడియాతో అన్నాడు.
కాగా, ఈ విషయం తెలియడంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వర్షం నీరు చేరడంతో ఎక్స్‌ప్రెస్ వే పై పెద్ద గుంత ఏర్పడినట్లు గ్రహించింది. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్మాణ సంస్థ నుంచి వివరణ కోరింది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై సాంకేతిక అవగాహన లేని ఒక జూనియర్ ఉద్యోగి ఈ వ్యాఖ్య చేసినట్లు కేసీసీ బిల్డ్‌కాన్ సంస్థ తెలిపింది. అతడ్ని కంపెనీ నుంచి తొలగించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐకు లేఖ రాసింది. గుంత ఏర్పడిన చోట మరమ్మతులు చేపట్టినట్లు వివరించింది.
మరోవైపు 1,386 కిలోమీటర్ల మేర విస్తరించిన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని 24 గంటల నుంచి సగానికి తగ్గించేందుకు దీనిని నిర్మిస్తున్నారు. హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర మీదుగా సాగే ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్ 80 శాతం పూర్తయిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల రాజ్యసభకు తెలిపారు. మరో ఏడాదిలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని వెల్లడించారు.