Arvind Kejriwal : ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) వేళ బీజేపీ నేతల తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు తొక్కని అడ్డదారి లేదని ఆయన విమర్శించారు. డిసెంబర్ 15 నుంచి జనవరి 7 వరకు ఈ 22 రోజుల వ్యవధిలో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తమ ఓటును రద్దు చేయాలని కోరుతూ 5,500 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.
ఎందుకు ఓటు రద్దు కోరుతున్నారని సంబంధిత అధికారులు ఆయా దరఖాస్తుదారులను ఫోన్లు చేసి అడగ్గా.. అసలు తాము ఓటు రద్దు కోసం దరఖాస్తే చేయలేదని చెప్పారని కేజ్రీవాల్ తెలిపారు. ఇదంతా బీజేపీ కుట్ర అని, తమ పార్టీకి పడవని నిర్ధారించుకున్న ఓట్ల రద్దు కోసం ఆ పార్టీ శ్రేణులే ఇలాంటి దరఖాస్తులు చేశాయని ఆరోపించారు. చాపకింద నీరులా ఢిల్లీలో బీజేపీ పెద్ద కుట్రే నడుపుతోందని అన్నారు.
ఢిల్లీలో గత 15 రోజుల నుంచి కొత్త ఓట్ల కోసం 13 వేల దరఖాస్తులు వచ్చాయని కేజ్రీవాల్ తెలిపారు. ఆ దరఖాస్తులు కూడా ఢిల్లీ ఓటర్లు పెట్టుకున్నవి కావని, ఇతర రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్న వారిని బీజేపీ ఢిల్లీలో ఓటర్లుగా చేర్పిస్తున్నదని విమర్శించారు. ఇక బీజేపీ న్యూఢిల్లీ అభ్యర్థి పర్వశ్ వర్మ జాబ్ క్యాంపులు నిర్వహిస్తూ బహిరంగంగా డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు.
ఈ విధంగా డబ్బులు పంచడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని, కాబట్టి పర్వేశ్ వర్మపై ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆయన ఇంట్లో సోదాలు జరిపి డబ్బులు సీజ్ చేయాలని తన డిమాండ్‌ను వినిపించారు.