డెహ్రాడూన్ : ఓ ఇద్దరు కూతుళ్లు తన తండ్రి చివరి కోరికను తీర్చారు. ముస్లింల ఈద్గా కోసం రూ. 1.5 కోట్ల విలువ చేసే నాలుగు బిగాల స్థలాన్ని విరాళంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటుకున్నారు. తండ్రి చివరి కోరికను తీర్చి, మనమంతా ఒకటేనని చెప్పిన ఆ ఇద్దరు మహిళలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఉత్తరాఖండ్‌లోని ఉధం సింగ్ నగర్ జిల్లాలోని కాశీపూర్‌కు చెందిన బ్రజ్నందన్ ప్రసాద్ రస్తోగి అనారోగ్యంతో బాధపడుతూ 2003లో చనిపోయాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే చనిపోయే కంటే ముందు తన చివరి కోరికను రస్తోగి కుటుంబ సభ్యులు, బంధువుల మందు ఉంచాడు. తనకున్న వ్యవసాయ భూమిలో నాలుగు బిగాల స్థలాన్ని ఈద్గా కోసం ముస్లింలకు విరాళంగా ఇవ్వాలని కోరాడు. కానీ ఈ విషయం ఇద్దరు కూతుళ్లకు, కుమారుడికి చెప్పకుండానే రస్తోగి కన్నుమూశాడు.
మొత్తానికి ఇద్దరు కూతుళ్లకు తన తండ్రి చివరి కోరికను బంధువుల ద్వారా తెలుసుకున్నారు. ఇక క్షణం కూడా ఆలోచించకుండా కాశీపూర్‌లో ఉంటున్న సోదరుడు రాకేశ్ రస్తోగి నివాసానికి ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు వెళ్లారు. తండ్రి చివరి కోరికను సోదరుడికి చెప్పడంతో అతను కూడా అంగీకరించాడు. తండ్రి ఆత్మకు శాంతి చేకూరేలా.. నాలుగు బిగాల స్థలాన్ని ఈద్గా కోసం ముస్లింలకు విరాళంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటుకున్నారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లతో పాటు రాకేశ్‌ను త్వరలోనే సన్మానిస్తామని ఈద్గా కమిటీ మెంబర్ హసీన్ ఖాన్ తెలిపాడు.