Himanta Biswa Sarma : ప్రస్తుత మాజీ సీఎం హిమంత బిశ్వశర్మ మరోసారి అసోం సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. హిమంతను బీజేపీ ఎల్పీ లీడర్‌గానే కాకుండా, ఎన్డీయే కూటమి లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా ఆదివారం ఎన్నుకున్నారు. ఈ నెల 12, మంగళవారం హిమంత సీఎంగా పదవీ ప్రమాణం చేయనున్నారు. ఆయన ఆధ్వర్యంలో అసోంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.
హిమంత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఎన్డీయే ఎల్పీ లీడర్‌గా ఎన్నికైన అనంతరం హిమంత మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘వరుసగా మూడోసారి అసోంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాని మోదీ మమ్మల్ని ఆశీర్వదించారు. ప్రధాని మోదీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. రాబోయే ఐదేళ్లు ప్రజల కోసం, అభివృద్ధి కోసం కష్టపడతాం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీకి కృతజ్ఞతలు” అని హిమంత బిశ్వ శర్మ అన్నారు.
ఇటీవల జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించింది. 126 సీట్లున్న అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 102 సీట్లు సాధించింది. అందులో బీజేపీకి 82 సీట్లు దక్కాయి. కూటమిలోని మిగతా రెండు పార్టీల్లో ఏజీపీకి 10 సీట్లు, బీపీఎఫ్ 10 సీట్లు గెలుచుకున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ అనంతరం, అంటే బుధవారం నాడే అసోం సీఎంగా హిమంత తన పదవికి రాజీనామా చేశారు.