షిమ్లా: జూనియర్ విద్యార్థిపై ర్యాంగింగ్(Ragging), దాడి చేసిన ఘటనలో ఇద్దరు మెడికల్ విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలో జరిగింది. అయితే జూనియర్ విద్యార్థిపై కూడా జరిమానా విధించారు. ర్యాంగింగ్కు పాల్పడిన సీనియర్లను జూనియర్ స్టూడెంట్ బెదిరించారని, డబ్బులు వసూల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీ యాజమాన్యంకు చెందిన నిజనిర్దారణ కమిటీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకున్నారు. 2024 బ్యాచ్‌కు చెందిన రెండో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న శుభమ్ సింగ్ డిసెంబర్ 19వ తేదీన ఫిర్యాదు చేశారు.
సీనియర్లు హర్ష్, ప్రశాంత్ జా.. హాస్టల్ రూమ్‌లో తనపై దాడి చేసినట్లు పేర్కొన్నాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా కాలేజీ యాజమాన్యం బాల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జూనియర్‌పై దాడి చేసినట్లు కమిటీ ముందు సీనియర్లు అంగీకరించారు. కానీ ఆ దాడికి పూర్వం యాంటీ ర్యాగింగ్ చట్టాల ప్రకారం సీనియర్లను జూనియర్ బెదిరించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.
సీనియర్ విద్యార్థులు తరుచూ ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటారని, గతంలో కూడా ఆ ఇద్దరూ కాలేజీ నుంచి సస్పెండ్ అయినట్లు తెలిసింది. కమిటీ నివేదిక ప్రకారం మూడు నెలల పాటు ఆ ఇద్దరు విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ డీకే వర్మ తెలిపారు. హాస్టల్ నుంచి కూడా ఏడాది పాటు వాళ్లను వేటు వేశారు. ఆ ఇద్దరికీ 20 వేల జరిమానా విధించారు.
సీనియర్ల నుంచి డబ్బులు వసూల్ చేయాలని భావించిన శుభమ్ సింగ్‌ను హాస్టల్ నుంచి ఆరు వారాల పాటు సస్పెండ్ చేశారు. అతనికి 10వేల ఫైన్ వేశారు.