DRDO : దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక రక్షణ రంగ సంస్థ డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) సంస్థ మరో భారీ బాంబు పరీక్షకు సిద్ధమైంది. హరియాణాలోని పంచకుల జిల్లాలోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (టీబీఆర్ఎల్) అనే ల్యాబ్ పరిధిలో ఈ ప్రయోగం జరగనుంది. ఇది బాంబులు, ఆయుధాలు తయారు చేసి పరీక్షించే ప్రత్యేక కేంద్రం. ఇక్కడ మే 31, ఆదివారం నాడు ఒక అధునాతన, భారీ బాంబును డీఆర్డీవో ప్రయోగించనుంది.
ఈ నేపథ్యంలో స్థానికులకు డీఆర్డీవో కీలక హెచ్చరిక జారీ చేసింది. స్థానిక ప్రజలెవరూ బాంబు ప్రయోగం సమయంలో ఇండ్లలోంచి బయటకు రావొద్దని సూచించింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ ల్యాబ్‌కు సమీప గ్రామల్లోని ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని సూచించింది. ప్రయోగం జరిగే సమయంలో బయట ఉండకపోవడమే మంచిదని సూచించింది. ఇదే సమయంలో ఈ బాంబు ప్రయోగం గురించి అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది. ఇది సాధారణ పరీక్షల్లో భాగమే అని, ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన పని లేదని సూచించింది. దీనిపై జరిగే దుష్ర్పచారాల్ని నమ్మొద్దని కూడా స్పష్టం చేసింది.
డీఆర్డీవో జారీ చేసే జాగ్రత్త చర్యలు పాటిస్తే మేలని చెప్పింది. ఇప్పుడు చేపట్టబోయేది భారీ బాంబు పరీక్ష. పేలుడు తర్వాత దీని ప్రభావం గాలిలో 1.5 కిలోమీటర్ల వరకు ఉంటుందని, దీన్ని డేంజర్ జోన్‌గా పిలుస్తారని వెల్లడించింది. ప్రజల సంరక్షణార్థం ఇక్కడికి స్థానికులను, సందర్శకులను అనుమతించడం లేదన్నారు. పూర్తి జాగ్రత్తలు, ప్రోటోకాల్ మధ్య ఈ పరీక్ష నిర్వహించనున్నారు. స్థానికులకు హాని కలగకుండా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కూడా పరిస్థితిని పర్యవేక్షించనుంది.