చెన్నై, ఆగస్టు 1: పథకాలకు సంబంధించి ఇచ్చే ప్రకటనల్లో పేర్ల వాడకంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివిధ ప్రకటనల ద్వారా పథకాలను ప్రారంభించేటప్పుడు, నిర్వహించేటప్పుడు జీవించి ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి/సైద్ధాంతిక నాయకుల ఛాయాచిత్రం లేదా పార్టీ చిహ్నం/జెండా చేర్చరాదంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు గురువారం ఆదేశించింది. ఏఐఏడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం, న్యాయవాది ఇనియన్ దాఖలు చేసిన కేసుపై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రకటనల కంటెంట్‌ను నియంత్రిస్తూ సుప్రీం కోర్టు ఎప్పటికప్పుడు వరుస ఆదేశాలు జారీ చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది.
ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకం ప్రారంభంపై కానీ, అమలుపై కానీ ఆంక్షలు విధిస్తూ తాము ఆదేశాలు జారీ చేయడం లేదని బెంచ్ తెలిపింది. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి ఫొటోను ప్రచురించడానికి అనుమతి ఉందని ధర్మాసనం తెలిపింది. పిటిషనర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా భారత ఎన్నికల సంఘం లేదా అధికారులు ఏదైనా చర్యను ప్రారంభించడంతో ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉండటం ఆటంకం కలిగించదని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే నెల 31వ తేదీకి వాయిదా వేసింది.