రాంచి: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండియా కూటమిలో సీట్ల పంపిణీ కుంపటి రాజేసింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఎంఎంసీ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. అయితే, ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది మాత్రం తేల్చుకోలేకపోతున్నాయి.
రాష్ట్రంలోని 81 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కలిపి 70 స్థానాల్లో పోటీ చేస్తాయని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం ప్రకటించారు. ఈ ప్రకటనపై రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అలక వహించింది.
హేమంత్ సోరెన్ తమతో సంప్రదించకుండా, ఏకపక్షంగా ఈ ప్రకటన చేశారని ఆర్జేడీ అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ ఝా ఆరోపించారు. తమకు అన్ని అవకాశాలు తెరిచే ఉన్నాయని పేర్కొంటూ, అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తామని పరోక్షంగా ప్రకటించారు. 15- 18 స్థానాల్లో తాము సొంతంగా గెలవగలమని ఆయన పేర్కొన్నారు.