ప్రయాగ్‌రాజ్: మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే దారులన్నీ తీవ్ర ట్రాఫిక్ జామ్‌తో నిండిపోతున్నాయి. 100 నుంచి 300 కి.మీ వరకు వాహనాలు బారులు తీరాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 200 కి.మీ దూరం నుంచి ప్రయాగ్‌రాజ్ రావడానికి తమకు 16 గంటలు పట్టిందని ఒక కుటుంబం వాపోయింది. నడక దారులు కూడా కిక్కిరిసిపోవడంతో 4 కి.మీ దూరానికి నాలుగు గంటలు పడుతున్నదని పలువురు భక్తులు వాపోయారు. రోజూ లక్షలాది మంది భక్తులు తరలివస్తుండటంతో నగరానికి దారితీసే అన్ని దారులు ట్రాఫిక్ జామ్‌తో స్తంభించిపోయాయి. దీంతో భక్తులు తాము అనుకున్న సమయానికి చేరలేక, గంగా, యమున, సరస్వతి సంగమంలో పుణ్య స్నానాలు చేయలేక తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు కూడా పరిస్థితిని చూసి చేతులెత్తేసినట్టు కన్పించింది. లక్షలాది మంది భక్తులు పోటెత్తడంతో ప్రయాగ్‌రాజ్ రైల్వేస్టేషన్‌ను శుక్రవారం వరకు మూసివేశారు. కాగా, రైల్వే స్టేషన్‌ను మూసివేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దంటూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ట్రాఫిక్ జామ్లలో గంటల పాటు చిక్కుకుపోయిన పలువురు విసిగిపోయి వెనక్కి వెళ్లిపోతుండటం కూడా కన్పించింది.
మహా కుంభమేళా నిర్వహణలో యూపీ ప్రభుత్వ వైఫల్యంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. లక్షలాది మంది భక్తులు తీవ్ర ట్రాఫిక్ జామ్‌లో గంటల తరబడి చిక్కుకుపోయి ఆకలి, దప్పులతో అలమటిస్తున్నారని, టాయిలెట్ సౌకర్యం లేక అల్లాడుతున్నారని అన్నారు. సామాన్యుల ఇబ్బందులు మీకు పట్టవా? అని ప్రశ్నించిన ఆయన వారిని మానవతా దృష్టితో చూడాలని కోరారు. కుంభ మేళా ఏర్పాట్ల గురించి యోగి ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైంది తప్ప, క్షేత్ర స్థాయిలో అడుగడుగునా లోపాలు, వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయని ఆయన విమర్శించారు.
ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు కాశీ, అయోధ్యలను కూడా దర్శించుకుంటుండటంతో ఈ రెండు ప్రాంతాలు లక్షలాది మంది భక్తులతో నిండిపోతున్నాయి.
ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం పుణ్యస్నానం చేస్తున్న రాష్ట్రపతి ముర్ము