Amarnath Yatra 2026 : దేశంలోని హిందూ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమర్నాథ్ యాత్రకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, యాత్రికుల రక్షణ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడంచెల భద్రతా వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే నున్వాన్ బేస్ క్యాంప్ నుంచి భగవతీ నగర్ బేస్ క్యాంప్ వరకు భద్రతా తనిఖీ, సానిటైజేషన్ పూర్తైంది.
వివిధ విభాగాలకు చెందిన భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. 670 కంపెనీలకు చెందిన బలగాలు విధులు నిర్వర్తించబోతున్నాయి. ఇందులో ఈసారి వికాస్ బెటాలియన్ అనే కొత్త బృందం విధులు నిర్వర్తించబోతుంది. పర్వత ప్రాంతాల్లో యుద్ధ చర్యల్లో పాల్గొనడం, భక్తుల్ని రక్షించడం వంటి వాటిలో ఈ బెటాలియన్ ప్రత్యేక శిక్షణ పొందింది. అలాగే, యాంటీ సోబగేట్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, అనంత్‌నాగ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సహా ఇతర విభాగాలకు చెందిన సెక్యూరిటీ సిబ్బంది భద్రతలో పాల్గొంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే అంశంపై పుల్వామా పోలీసులు మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. బల్తాల్ యాక్సిస్ నుంచి అత్యవసర పరిస్థితుల్లో భక్తుల్ని రక్షించేందుకు వీలుగా సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. ఈ యాత్రకు భక్తులకు స్వాగతం పలికేందుకు అమర్నాథ్ దేవస్థాన బోర్డ్‌తోపాటు జమ్మూ కాశ్మీర్ పాలనావిభాగం సిద్ధమైంది.
ఈ మేరకు ఇప్పటికే అమర్నాథ్ యాత్ర మార్గాలు, క్యాంప్‌లకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. పలు ఫొటోల్ని కూడా విడుదల చేశారు. బంకర్లు ఏర్పాటు చేశారు. భక్తులు ప్రయాణించే మార్గాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అందులోనూ ఫేసియల్ రికగ్నిషన్ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా అమర్నాథ్ యాత్ర భద్రతా ఏర్పాట్లపై ఇటీవల సమీక్ష నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.