బెంగళూరు, మే 19: బెంగళూరులో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ఈ ఏడాది అత్యధికంగా నమోదైన కుండపోత వానతో ఐటీ నగరం అతలాకుతలమైంది. కెంగేరి, కోరమంగళ, మరతళ్లి, ఆర్ఆర్ నగర్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఏరియాలు వరద బీభత్సానికి విలవిల్లాడాయి. గరిష్ఠంగా కెంగేరిలో 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మాన్యత టెక్‌పార్క్‌లో మోకాలు లోతు నీళ్లు నిలిచాయి. దీంతో సోమవారం ఉదయం రంగంలోకి దిగిన సహాయ బృందాలు ఇండ్లలో చిక్కుకున్న ప్రజలను పడవలు, ట్రాక్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. మహానగర పాలక సంస్థ అధికారులు మోటర్ల ద్వారా నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. వరదనీటిని తట్టుకునే నీటి నిర్వహణ వ్యవస్థలో లోపాల కారణంగానే ప్రతీసారి చిన్నపాటి వర్షానికి కూడా బెంగళూరు మునిగిపోతున్నదని ప్రజలు, నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
చిన్నపాటి వానకే నగరం అతలాకుతలం అవుతున్నదని బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ కర్ణాటక ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే వీ సునీల్‌కుమార్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బెంగళూరు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటే కాంగ్రెస్ సర్కారు రెండో వార్షికోత్సవం జరుపుకోవడం దారుణమని ధ్వజమెత్తారు. ఈ మేరకు హోస్పేట్, బళ్లారిలో భారీ సభలకు సన్నాహాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకుండా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విందు సమావేశాల్లో నిమగ్నమయ్యారని విమర్శించారు. వారు తక్షణమే ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు.