హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వరుణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. రెండు, మూడు రోజుల నుంచి దంచికొడుతున్నాడు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలో వారంరోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.
13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినట్టు వెల్లడించింది. క్యుములోనింబస్ మేఘాలతో కారణంగా హైదరాబాద్‌తోపాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపింది. హైదరాబాద్‌తో పాటు పలు పట్టణాల్లో వరద ముంపు, ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదివారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసినట్టు వివరించింది.
సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, హనుమకొండ, నిజామాబాద్, ఖమ్మం, బీ కొత్తగూడెం, వరంగల్, సూర్యాపేట, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, కామారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసనట్టు తెలిపింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లా నాంపల్లిలో 9.30 సెం.మీ, అమీర్‌పేట్‌లో 9.16 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది.
భారత వాతావరణ విభాగం (ఐఏండీ) తాజా అంచనాల ప్రకారం.. ఈనెల 13నాటికి వాయవ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ కారణంగా జమ్మూ-కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, ఢిల్లీ, యూపీలో భారీ వర్షాలు కురుస్తాయి.
గద్వాల/అయిజ/నందికొండ/మహదేవపూర్, ఆగస్టు 10 : జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 90 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా ఎనిమిది గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం అవుట్ ఫ్లో 85,989 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 కాగా ప్రస్తుతం 8.531 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు భారీగా వరద చేరుతుండటంతో 4 క్రస్ట్ గేట్లు ఎత్తి 16,835 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదిలోకి విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు 65,842 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా డ్యాం 8 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్‌కు ఆదివారం 90,330 క్యూసెకుల వరద వచ్చింది. మొత్తం 85 గేట్లు ఎత్తి అంతేమొత్తంలో ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని కుంచపర్తి లాకుల సమీ పంలో ఎన్ఎస్పీ కాలువకు భారీ గండిపడింది. దీంతో 20 ఎకరాల వరి పంట నీట మునిగింది.
సిరిసిల్ల రూరల్, ఆగస్టు 10 : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి ప్రభుత్వ పాఠశాల ప్రాంతంలోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. భారీ వరద వచ్చినప్పుడు వెంటనే వెళ్లిపోయే పరిస్థితి లేదని, కొంతకాలంగా తాము ఇబ్బందులు పడుతున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. నీరు నిలిచి రోగాల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు.