తిరువనంతపురం, జూన్ 1: నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలో కుండపోత వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. పంట పొలాలు నీట మునిగాయి. మధ్య, దక్షిణ జిల్లాల్లో వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. కొన్ని గంటల పాటు నిరంతరాయ వర్షం వల్ల కొన్ని చోట్ల ఇండ్లు, వాహనాలు, స్థానిక రహదారులు దెబ్బ తిన్నాయి. నలుగురి చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. భారత వాతావరణ విభాగం శనివారం త్రిస్సూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇడుక్కి, పాలక్కాడ్, వయనాడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో వర్షాల ప్రభావం ఉండొచ్చని తెలిపింది. ఇడుక్కి జిల్లాలోని మలంకార ఆనకట్టలో అయిదు షట్టర్లను ఎత్తివేశారు.