AAP | న్యూఢిల్లీ : ఛండీఘర్ మేయర్ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసానికి పాల్పడిందని ఆప్ ఆరోపించింది. ఈ క్రమంలోనే బీజేపీ కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో నిరసన చేపట్టాలని ఆప్ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సెంట్రల్ ఢిల్లీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఆందోళనల్లో ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ పాల్గొనే అవకాశం ఉంది.
ఆప్ ఆందోళనలకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని, ఆప్ నిరసనలను అడ్డుకుంటామన్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయం, డీడీయూ మార్గ్, ఐటీవో ఏరియాను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక ఆప్ కార్యాలయం ఎదుట కూడా ఆందోళనకు దిగుతామని బీజేపీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆప్ కార్యాలయం వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీ ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గ్ ద్వారా వెళ్లే వాహనాలను మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు.