చండీగఢ్, ఆగస్టు 22: ఉత్తరాదిలో ఇటీవల సంభవించిన వరదల వల్ల భారీగా పంట నష్టం జరిగిందని, కేంద్రం తక్షణమే రూ.50,000 కోట్లను విడుదల చేసి ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని కోరాయి. వరదలు సంభవించి చాలా రోజలవుతున్నా కేంద్రం స్పందించకపోవడంతో దాదాపు 16 రైతు సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీంతో హర్యానా, పంజాబ్ రైతులు మంగళవారం చండీగఢ్‌కు బాటపట్టారు. వేల మంది రైతులు నడుచుకుంటూ, ట్రాక్టర్ల మీద చండీగఢ్‌కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. శంబూ సరిహద్దులో రైతులను అరెస్టు చేసి బస్సుల్లో పోలీస్స్టేషన్లకు తరలించారు. అంతేగాక పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో, చండీగఢ్‌లో భారీగా పోలీసులను మోహరించారు. దీంతో హర్యానా, పంజాబ్‌లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది.