న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇండియా భగభగ మండిపోయిన విషయం తెలిసిందే. భానుడి ప్రతాపానికి జనం విలవిలలాడారు. దాదాపు 45 రెట్లు అధికంగా ఈ సారి ఇండియాలో ఏప్రిల్ ఎండలు మండినట్లు ఓ స్టడీలో తేల్చారు. దీనికి వాతావరణ మార్పులే కారణమని తేలింది. గ్లోబల్ టెంపరేచర్లు పెరిగిపోవడం వల్ల హీట్‌వేవ్(Heat Wave) కొనసాగినట్లు భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1.2 డిగ్రీల సెల్సియస్ నుంచి 2 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగినట్లు వరల్డ్ వెదర్ అట్రిబూషన్(డబ్ల్యూడబ్ల్యూఏ) తన నివేదికలో పేర్కొన్నది. ఆసియాను అతలాకుతలం చేసిన హీట్‌వేవ్స్ గురించి డబ్ల్యూడబ్ల్యూఏ తయారు చేసిన రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఏడు మంది శాస్త్రవేత్తలు, మరో ఆరు మంది రివ్యూ చేసిన రిపోర్టును డబ్ల్యూడబ్ల్యూఏ రిలీజ్ చేసింది. 2022, 2023 సంవత్సరాల్లో ఆ స్టడీని చేపట్టారు.
ఆసియాలోని మూడు ప్రాంతాల్లో ఉన్న వాతావరణ డేటాను శాస్త్రవేత్తలు తమ స్టడీ కోసం సేకరించారు. పశ్చిమాసియాలో మూడు రోజుల అత్యధిక ఉష్ణోగ్రతలను, పిలిప్పీన్స్ నుంచి 15 రోజు సగటు అత్యధిక ఉష్ణోగ్రతలను, దక్షిణాసియాలోని ఇండియా, కంబోడియా దేశాల్లోని సగటు ఏప్రిల్ ఉష్ణోగ్రతలను అధ్యయనం చేశారు. అయితే ఆ స్టడీ ద్వారా సగటున రోజు వారి అత్యధిక ఉష్ణోగ్రత 30 రెట్లు పెరిగినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దక్షిణ ఆసియాలో నమోదు అయిన 30 రోజుల హీట్‌వేవ్.. సుమారు 30 ఏళ్లకు ఒకసారి రికార్డు అవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే తాజా స్టడీ ప్రకారం.. ఇండియాలో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు 45 రెట్లు అధికంగా నమోదు అయ్యాయని, వాతావరణ మార్పుల వల్ల 0.85 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదు అయినట్లు స్టడీలో తేల్చారు.