Heatwave : భానుడి భగభగలతో దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వడగాలులు పలు హిందీ రాష్ట్రాలను చుట్టేస్తుండటంతో ప్రజలు మధ్యాహ్న వేళ ఇండ్లకే పరిమితమవుతున్నారు. సూర్యుడు నిప్పులు చెరగడంతో ఉక్కపోతతో ప్రజలు విలవిలలాడుతున్నారు.
గత కొద్దిరోజులుగా ఢిల్లీ, పంజాబ్, హరియాణ, యూపీ, రాజస్ధాన్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరువయ్యాయి. రాబోయే మూడు రోజులూ ఉత్తరాదిన వడగాలులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజా నివేదిక వెల్లడించింది.
ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లో సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 48.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదై నగరంలో హాటెస్ట్ ఏరియాగా నిలిచింది.జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వడగాలులు వీస్తాయని ఐఎండీ వాతావరణ నివేదిక వెల్లడించింది.
మధ్యప్రదేశ్, చత్తీస్ఘఢ్లోనూ ఎండ వేడిమి, వడగాలుల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. వడగాలులు, ఎండ తీవ్రతతో ఢిల్లీలో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదివారం ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత 45.4 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది.
ఇక దేశవ్యాప్తంగా 17 ప్రాంతాల్లో సోమవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల మార్క్‌ను దాటడంతో ఆయా ప్రాంతాల్లో వేడి గాలులు వీచాయి. హరియాణలోని సిర్సాలో 48.4 డిగ్రీలు, పంజాబ్‌లోని భటిండాలో 48.4 డిగ్రీలు, యూపీలోని ఝాన్సీలో 48.1 డిగ్రీలు, మధ్యప్రదేశ్‌లోని నివారిలో 48.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
అయితే దేశంలోని వాయువ్య, మధ్య ప్రాంతంలో సోమవారం తీవ్ర వడగాడ్పుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని ఐఎండీ అంచనా వేసింది. తీవ్ర వడగాలులు కొనసాగుతుండటంతో ఉత్తరాది ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read More :
NTR | ఎన్టీఆర్ 101వ జయంతి.. నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ