Obesity | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఊబకాయుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరి మరణాలకు గుండెజబ్బులే కారణమని తాజా అధ్యయనం వెల్లడించింది. గత నాలుగు దశాబ్దాల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువై ప్రస్తుతం 100 కోట్లకు చేరిన తరుణంలో ఈ అధ్యయనం జరిగింది. లావుగా ఉండటం వల్ల గుండె వైఫల్యం, ఆకస్మిక గుండె పోటు, ధమనుల గోడల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకొనే వ్యాధి, రక్తం గడ్డ కట్టే వ్యాధి, గుండె కొట్టుకోవడంలో అసమతుల్యత కలిగే ప్రమాదం ఉందని అధ్యయనం తెలిపింది.
గుండె నిర్మాణం, పనితీరుపైనా స్థూలకాయం ప్రభావం చూపుతుందని చెప్పింది. పలు సాంక్రమిక వ్యాధులు రావడానికి స్థూలకాయం ఒక కారణమని.. వివిధ అవయవాలపైనా అధిక బరువు ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపింది. మధుమేహానికి, స్థూలకాయానికి దగ్గరి సంబంధం ఉందని అధ్యయనం వివరించింది.
80-85 శాతం డయాబెటిస్ రోగులు స్థూలకాయులు లేదా అధిక బరువు ఉన్నవారిని తెలిపింది. సాధారణ బరువున్న వారితో పోలిస్తే స్థూలకాయుల్లో టైప్-2 డయాబెటిస్ అభివృద్ధి కావడం మూడు రెట్లు ఎక్కువని వెల్లడించింది. 20-49 ఏండ్ల వయసు కలిగిన మగవారిలో 78 శాతం, ఆడవారిలో 65 శాతం అధిక రక్తపోటు రావడానికి అధిక బీఎంఐ కారణమై ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.