హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): పాకిస్థాన్ నుంచి అడ్డదారిలో ఇండియాకు వచ్చి, హైదరాబాద్‌లో ఒక మహిళతో కాపురం చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బహదూర్‌పుర పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముండే ఓ వివాహితకు ఇద్దరు పిల్లలు. ఆమె కొన్నేండ్ల క్రితం జీవనోపాధి కోసం దుబాయ్‌కి వెళ్లింది. అక్కడ పనిచేసే చోట ఆమెకు పాకిస్థాన్‌కు చెందిన ఫయాజ్‌తో పరిచయం ఏర్పడగా, పెండ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు ఇద్దరు అక్కడ కాపురం చేశారు. సదరు మహిళ మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోలేదు. నిరుడు ఆమె దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రాగా, ఫయాజ్ పాకిస్థాన్‌కు వెళ్లాడు.
ఇరువురు ఫోన్లలో మాట్లాడుకుంటుండగానే, తాను గర్భవతినని చెప్పింది. దీంతో ఫయాజ్ గత నవంబర్‌లో నేపాల్ మీదుగా బీహార్‌లోకి అక్రమంగా ప్రవేశించి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఆ మహిళతో కలిసి కిషన్‌బాగ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఫయాజ్ అక్రమంగా చొరబడినట్టు నిఘా వర్గాలు గుర్తించి, స్థానిక పోలీసులను అప్రమత్తం చేశాయి. గురువారం ఫయాజ్ను బహదూర్‌పుర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో కుట్ర కోణం లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు, మరిన్ని వివరాలు సేకరించి స్పష్టతకు వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి ఘటనలో 2019లో హైదరాబాద్‌లో జరుగగా, పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.