లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన హింసాత్మక కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ లభించింది. అలహాబాద్ హైకోర్టు ఆయనకు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ రోజునే ఆశిష్ మిశ్రాకు కోర్టు బెయిల్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
గత ఏడాది అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరిలో రోడ్డు పక్కన నిరసన చేస్తున్న రైతులను, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు, ఆశిష్ మిశ్రా తన కాన్వాయ్‌లోని కారుతో తొక్కించాడు. దీంతో హింస రాజుకున్నది. నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, వాహనం డ్రైవర్ మరణించారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. రైతు సంఘాలు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
మరోవైపు లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకుంది. యూపీలోని అధికార బీజేపీ ప్రభుత్వానికి, పోలీసులకు చీవాట్లు పెట్టింది. దీంతో ఈ హింసాత్మక ఘటనపై దర్యాప్తు కోసం సిట్‌ను నియమించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ 9న ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ చార్జిషీట్‌ను సిట్ దాఖలు చేసింది. అలాగే వాహనం డ్రైవర్, బీజేపీ కార్యకర్తల మరణంపై దాఖలైన మరో కేసులో కూడా ఇటీవల చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది. దీంతో అరెస్టైన నాలుగు నెలల తర్వాత ఆశిష్ మిశ్రాకు బెయిల్ లభించింది.