న్యూఢిల్లీ : సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందినవిగా విస్తృతంగా పరిగణించబడుతున్నప్పటికీ కింది స్థాయి స్థానిక సంస్థల్లో తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రాహ్మణులను రాజకీయంగా వెనుకబడిన తరగతులు(పీబీసీ)గా వర్గీకరించి పంచాయతీ నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు మంజూరు చేయాలా? అన్నదానిపై సుప్రీంకోర్టు విచారణ జరుపనున్నది. సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ద్వారా యూత్ ఫర్ ఈక్వాలిటీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై సీజేఐ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ ప్రశ్నపై అధ్యయనం చేయడానికి అంగీకరించింది.
న్యూఢిల్లీ: హిందూ అగ్ర కులానికి చెందిన ఓ వ్యక్తి బౌద్ధమతంలోకి మారి తనకు మైనారిటీ రిజర్వేషన్ కల్పించాలని కోరడం పట్ల సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇదో కొత్త రకం మోసమంటూ సీజేఐతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. మైనారిటీ అభ్యర్థినైన తనకు అడ్మిషన్ కల్పించాలని కోరుతూ నిఖిల్ కుమార్ పునియా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. పునియా అన్న పేరు పెట్టుకున్న నువ్వు మైనారిటీవి ఎలా అవుతావని ధర్మాసనం ప్రశ్నించగా తాను జాట్ పునియానని, తాను బౌద్ధమతంలోకి మారానని, అది తన హక్కని పునియా తరఫు న్యాయవాది వాదించారు. ఇదో కొత్త రకం మోసమంటూ సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.