కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో హర్యానా కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా, కుమారి షెల్జా, రణదీప్ సూర్జేవాలాతో సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, సంస్థాగత విస్తరణపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం భూపేందర్ హుడా మాట్లాడుతూ… తమలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, కలిసికట్టుగా వుంటూ… ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నారు. ఇక… పార్టీ ఎదిగే విధానం, ఎన్నికల్లో ఎలా గెలవాలి అన్న విషయాలను రాహుల్ గాంధీ ముందు ఉంచామని హుడా పేర్కొన్నారు.
ఇక ఈ సమావేశం ముగిసిన తర్వాత సీనియర్ నేత, హర్యానా పీసీసీ అధ్యక్షురాలు సెల్జా కూడా స్పందించారు. కింది స్థాయి నుంచి పార్టీని తిరిగి పునర్నిర్మించాలని అందులో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. తామందరమూ తమ తమ ఐడియాలను రాహుల్ ముందు ఉంచామని తెలిపారు. రాహుల్ ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకున్నారని సెల్జా పేర్కొన్నారు.