చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ ఆప్‌లో చేరారు. గత ఏడాది నవంబర్‌లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన తన్వర్ ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని ఆప్ గూటికి చేరారు.
అశోక్ తన్వర్ సోమవారం ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. 2024లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న ఆప్ తన్వర్ చేరికతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది.
తన్వర్‌ను ఆప్‌లోకి స్వాగతించిన కేజ్రీవాల్ ఆయన రాజకీయ అనుభవం హర్యానాతో పాటు దేశవ్యాప్తంగా ఆప్ విస్తరణకు బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అశోక్‌జీని ఆప్ కుటుంబంలోకి స్వాగతిస్తున్నానని, విద్యార్ధి రాజకీయాల నుంచి పార్లమెంట్ వరకూ మీ రాజకీయ అనుభవం ఆప్‌నకు హర్యానాతో పాటు జాతీయ రాజకీయాల్లో ఎదుగుదలకు ఉపకరిస్తుందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.