Haryana Elections | చండీగఢ్, ఆగస్టు 16: హర్యానా ఎన్నికల నగారా మోగింది. 90 స్థానాలు ఉన్న ఈ అసెంబ్లీకి అక్టోబరు 1న ఎన్నికలు జరగనున్నాయి. గత పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్ సాధించి మరోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్నది. ప్రభుత్వంపై వ్యతిరేకతను, హామీల వర్షాన్ని కురిపించి గద్దెనెక్కాలని కాంగ్రెస్ ఆశిస్తున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ, జన్నాయక్ జనతా పార్టీ(జేజేపీ), ఐఎన్ఎల్డీ సైతం పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్య కనిపిస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని పది స్థానాల్లో ఈ రెండు పార్టీలు చెరో ఐదు స్థానాలను గెలుచుకోవడం బట్టి ఈ విషయం స్పష్టమవుతున్నది.
2014లో హర్యానాలో సొంత బలంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ 2019 నాటికి మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడంతో జేజేపీతో పొత్తు పెట్టుకొని అధికారం చేపట్టింది. ఈ పొత్తు ఇప్పుడు విచ్ఛిన్నమైంది. రైతుల ఆందోళన, అగ్నివీర్ పథకం, నిరుద్యోగం వంటి అంశాలతో పాటు పదేండ్ల పాలనపై సహజంగా ఉండే ప్రజావ్యతిరేకత బీజేపీకి మైనస్‌గా మారాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించేందుకు తొమ్మిదిన్నరేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్‌లాల్ ఖట్టర్‌ను తప్పించి నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిని చేసింది. అగ్నివీరులకు పలు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం కల్పించింది. కొత్తగా 10 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి రైతుల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేసింది.
ప్రజలను ఆకర్షించడమే పనిగా వరాలు ప్రకటించి కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో సక్సెస్ అయిన ఫార్ములానే హర్యానాలోనూ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులకు నెలకు రూ.6,000 పింఛను, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీలు ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కలిసొస్తుందని ఆశిస్తున్నది. ఇక, ఆమ్ ఆద్మీ కూడా ఉచిత విద్య, వైద్యం, విద్యుత్తు వంటి జనాకర్షక హామీలు భారీగానే ఇచ్చింది. ఆప్, జేజేపీ, ఐఎన్ఎల్డీ కాంగ్రెస్ ఓట్లకు గండి కొట్టే సూచనలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.