Spying | పహల్గాం ఉగ్రదాడితో అధికారులు అప్రమత్తమయ్యారు. జమ్ము కశ్మీర్ సహా సరిహద్దు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. అంతేకాదు పాక్ అధికారులకు కీలక సమాచారాన్ని చేరవేస్తున్న వారి గుట్టును (spying) రట్టుచేస్తున్నారు. ఈ క్రమంలో కీలక సమాచారాన్ని పాక్ అధికారులతో పంచుకుంటున్న హర్యానాకు చెందిన ఓ యూట్యూబర్ (Haryana based YouTuber) సహా ఆరుగురు భారతీయుల్ని (Indian nationals) అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు.
పాకిస్థాన్‌కు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) సహా ఆరుగురు భారతీయులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెట్ వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించినట్లు గుర్తించారు. వీరంతా పాక్ ఐఎస్ఐకి ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.
ట్రావెల్ వ్లాగర్ జ్యోతి.. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొందిన జ్యోతి 2023లో పాక్‌ను సందర్శించింది. ఆమె ఎవరికీ అనుమానం రాకుండా పాక్ అధికారులకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తేలింది. ఈ కేసులో జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వ్లాగర్‌తో కలిసి పని చేస్తున్నట్లు గుర్తించారు. మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా, పంజాబ్ నుంచి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో జ్యోతి మల్హోత్రా పరిచయాలు పెంచుకుంది.
డానిష్‌ను ప్రభుత్వం ఇటీవేల బహిష్కరించిన విషయం తెలిసిందే. డానిష్ గురించి వివరాలన్నీ బయటకు లాగడంతో జ్యోతి గురించి వెలుగులోకి వచ్చింది. పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లకు (PIO) డానిష్.. జ్యోతి మల్హోత్రాను పరిచయం చేసినట్లు తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్ట్ చేసిన ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతో నిత్యం టచ్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారానే భారత్‌కు చెందిన కీలక సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేసినట్లు తెలిసింది. ‘జాట్ రంధావా’ అని సేవ్ చేసుకున్న ఓ పేరు షకీర్ అలియాస్ రాణా షాబాజ్ అనే పాకిస్థాన్ వ్యక్తిదిగా అధికారులు గుర్తించారు.
మన దేశంలోని ప్రదేశాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌తో పంచుకున్నట్లు తేలింది. ఇక సోషల్ మీడియా వేదికగా పాక్ సానుకూల ఇమేజ్‌లను నిత్యం పోస్టు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు ఓ పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌తో సన్నిహితంగా మెలుగుతున్నట్లు కూడా తేలింది. అతడితో ఆమె అంతర్జాతీయ ట్రిప్‌కు కూడా వెళ్లింది. ఇండోనేషియాలోని బాలికి విహారయాత్రకు వెళ్లి వచ్చినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. జ్యోతిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 152 సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఇక దర్యాప్తులో తాను తప్పు చేసినట్లు జ్యోతి రాతపూర్వకంగా అంగీకరించినట్లు సమాచారం. జ్యోతితోపాటు మరో ఐదుగురి గుట్టును కూడా అధికారులు బయటపెట్టారు. వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read..
Haryana Student | పాక్‌కు సున్నితమైన సమాచారం లీక్.. హర్యానా విద్యార్థి అరెస్ట్
Boycott Turkey | తుర్కియే బ్రాండ్స్ అమ్మకాలను నిలిపివేసిన మింత్ర, అజియో
ISIS sleeper cells | ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు ఐసిస్ సభ్యులు అరెస్ట్