Boycott Turkey | ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు తుర్కియే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. మద్దతు ఇవ్వడంతోపాటు డ్రోన్లు, ఆయుధాలను కూడా సరఫరా చేసింది. దీంతో తుర్కియేపై భారత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుతం నెట్టింట ‘బాయ్‌కాట్ తుర్కియే’ (Boycott Turkey) ట్రెండ్ అవుతోంది. ఆ దేశ వస్తువులను భారత్‌లో నిషేధించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ వ్యాపారులు తుర్కియేతో వాణిజ్య సంబంధాలను తెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే పలువురు వ్యాపారులు తుర్కియే యాపిల్స్, ఇతర వస్తువుల విక్రయాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థలు మింత్ర (Myntra), అజియో (Ajio) వచ్చి చేరాయి. తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తుర్కియేకి చెందిన వస్త్ర బ్రాండ్లను తొలగించాయి. గత వారం నుంచి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ప్రముఖ ఆన్లైన్ ఫ్యాషన్ పోర్టల్ మింత్రా తెలిపింది. రిలయన్స్‌కు చెందిన ఆన్లైన్ ఫ్యాషన్ పోర్టల్ అజియో కూడా తుర్కియేకి చెందిన ప్రముఖ వస్త్ర బ్రాండ్లయిన కోటాన్, ఎల్సీ వైకికి, మావి వంటి వాటి అమ్మకాలను తమ సైట్లో నిలిపివేసింది. అంతేకాకుండా, తుర్కియేలో తమ సంస్థ కార్యకలాపాలను కూడా మూసివేసినట్లు రిలయన్స్ అధికారి ఒకరిని ఊటంకిస్తూ వరుస కథనాలు వస్తున్నాయి.
Also Read..
5 వేల మంది పాక్ బిచ్చగాళ్లను తరిమేసిన సౌదీ