వాషింగ్టన్: గాజాను స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా అడుగులు వేస్తున్నది. ఇజ్రాయెల్ దాడులతో పూర్తిగా ధ్వంసమైన గాజా నుంచి పాలస్తీనియన్లను లిబియాకు (Palestinians To Libya)తరలించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. సుమారు 10 లక్షల మంది పాలస్తీనియన్లను శాశ్వతంగా లిబియాకు పంపించేందుకు సిద్ధమవుతున్నది. ఈ మేరకు లిబియా నాయకత్వంతో సంప్రదింపులు జరుతున్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రతిపాదనకు లిబియా అంగికరిస్తే బదులుగా అమెరికా బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేయనుందని సమాచారం.
గత ఫిబ్రవరిలో యుద్ధక్షేత్రం గాజాను స్వాధీనం చేసుకుంటాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాజా స్ట్రిప్ నుంచి 10 లక్షల మంది పాలస్తీనియన్లను లిబియాకు శాశ్వతంగా తరలించేందుకు ఆయన టీమ్ పనిచేస్తున్న ఎన్బీసీ న్యూస్ వెల్లడించింది. అమెరికాకు చెందిన ఓ అధికారి ఇప్పటికే లిబియాతో కూడా చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. పాలస్తీనియన్లకు పునరావాసం కల్పించినందుకుగాను లిబియాకు దశాబ్దం కింద స్తంభింపచేసిన బిలియన్ల డాలర్ల నిధులను విడుదల చేయనుందని తెలిపింది.
‘మేం(అమెరికా) గాజాను స్వాధీనం చేసుకుంటాం. అక్కడ ధ్వంసమైన భవనాల వ్యర్థాలను తొలగించాల్సి ఉంది. యుద్ధం కారణంగా పేలకుండా మిగిలిపోయిన బాంబులను నిర్వీర్యం చేయాల్సి ఉంది. ఆ తర్వాత గాజాను ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం. అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తాం. దాంతో ఆర్థికాభివృద్ధి, కొత్త ఇళ్ల నిర్మాణం జరుగుతుంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.