Prakash Karat | అతి వాద నేత ప్రకాశ్ కారత్కు సీపీఎం పగ్గాలు తిగిరి అప్పగించినట్లు తెలుస్తున్నది. ఇటీవల సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి అనారోగ్యంతో మరణించడంతో ఆ పదవికి నేతను ఎన్నుకోవాల్సి వచ్చింది. సాధారణంగా సీపీఎంలో మూడేండ్లకోసారి జరిగే పార్టీ జాతీయ మహాసభలో ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో జరిగే పార్టీ మహాసభలో పూర్తిస్థాయి ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునే వరకూ పార్టీకి సారధ్యం వహించాల్సిందిగా సీపీఎం పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ ప్రకాశ్ కారత్ ను కోరినట్లు తెలుస్తున్నది.
శుక్ర, శనివారాల్లో సీపీఎం పోలిట్ బ్యూరో, ఆదివారం కేంద్ర కమిటీ సమావేశం జరిగాయి. ప్రస్తుతానికి ఎటువంటి మార్పుల్లేవని సీపీఎం వర్గాలు తెలిపాయి. లౌకిక శక్తులను ఏకం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహంపై తాము పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశాల్లో చర్చించామని ఆ నేత చెప్పారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న హర్యానాలో ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేస్తోంది. త్వరలో జరిగే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆ నేత అన్నారు.