ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు
పౌరులు, పోలీసులకు గాయాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన శోభాయాత్ర హింసాత్మకంగా మారింది. రెండువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఘర్షణల్లో సాధారణ పౌరులతోపాటు పోలీసులు కూడా గాయపడ్డారు. జహంగిర్పూరి ప్రాంతంలోని కుశాల్ సినిమా థియేటర్ దగ్గరకు రాగానే ఊరేగింపుపై కొందరు దుండగులు రాళ్లు విసిరేశారని ఓ పోలీసు అధికారి తెలిపారు.
రాళ్లదాడిలో పలు వాహనాలు, దుకాణాలు ధ్వంసమైనట్టు పేర్కొన్నారు. కొన్ని వాహనాలకు దుండగులు నిప్పు పెట్టినట్టు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్తానా తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకొంటామన్నారు. సోషల్మీడియాలో ప్రచారమయ్యే వదంతులను నమ్మొద్దని పౌరులకు సూచించారు.
హోంమంత్రి ఆరా
ఘర్షణలకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు కమిషనర్, స్పెషల్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్)తో ప్రత్యేకంగా మాట్లాడారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు, దేశ రాజధానిలో శాంతి భద్రతల బాధ్యత కేంద్రప్రభుత్వానిదేనని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్న కొందరు బంగ్లాదేశీయులే ఈ ఘర్షణలకు కారణమని బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆరోపించారు.