న్యూఢిల్లీ : పార్టీలు, సంకీర్ణ కూటముల పేరు దేశం పేరుతో ఉండకూడదని బిహార్ మాజీ సీఎం, హిందుస్తాన్ ఆవాం మోర్చా (హెచ్ఏఎం) చీఫ్ జితన్ రాం మాంఝీ (Jitan Ram Manjhi) పేర్కొన్నారు. దేశం పేరును పోలిన పేరును రాజకీయ పార్టీలు, కూటములు కలిగిఉండరాదని విపక్ష పార్టీల కూటమి ఇండియాను ప్రస్తావిస్తూ మాంఝీ స్పష్టం చేశారు. ఓటర్ల సెంటిమెంట్‌ను ఆకట్టుకునేందుకు వారు (విపక్షాలు) ఇలా చేసి ఉండవచ్చని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ అద్భుతంగా ఉందని, 2024లో ప్రధాని మోదీ నేతృత్వంలోనే మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందని దేశం వెలుపల సైతం ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఇక బెంగళూర్‌లో జరిగిన 26 విపక్ష పార్టీల సమావేశంలో ప్రతిపక్ష కూటమి పేరును ఇండియా (భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి)గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
గతంలో విపక్ష కూటమి యూపీఏ పేరుతో ఉండేదని నేటి సమావేశంలో 26 పార్టీలు ప్రతిపక్షాల పేరును ఇండియాగా ఖరారు చేశాయని బెంగళూర్ భేటీ అనంతరం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. ఈ పేరును అందరూ ఆమోదించారని, ఈ పేరును ఖరారు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించామని తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని పాలక ఎన్డీఏను రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సమిష్టిగా ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలను ఖరారు చేసేందుకు బెంగళూర్‌లో 26 విపక్ష పార్టీల నేతలు సమావేశమై విస్తృత సంప్రదింపులు జరిపారు.
Read More :