న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds) ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన టాప్ 30 సంస్థల్లో సగానికిపైగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) దర్యాప్తులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని సంస్థల ఆస్తులను కూడా దర్యాప్తు ఏజెన్సీలు అటాచ్ చేశాయి. అయితే రాజకీయ పార్టీలకు విరాళాల అంశం కూడా ఆయా సంస్థలపై దాడులు, దర్యాప్తు తీవ్రతను ప్రభావితం చేసినట్లు తెలిసింది.
కాగా, ఎలక్షన్ కమిషన్ (ఈసీ)కు ఎస్బీఐ అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారం ప్రకారం వాటిని కొనుగోలు చేసిన టాప్ కంపెనీల్లో సగానికి పైగా ఏజెన్సీల దర్యాప్తును ఎదుర్కొంటున్నాయి. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, హల్దియా ఎనర్జీ లిమిటెడ్, వేదాంత లిమిటెడ్, యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డీఎల్ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్ లిమిటెడ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, చెన్నై గ్రీన్వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, ఐఎఫ్బీ ఆగ్రో లిమిటెడ్, ఎన్సీసీ లిమిటెడ్, దివీస్ లేబొరేటరీ లిమిటెడ్, యునైటెడ్ ఫాస్ఫరస్ ఇండియా లిమిటెడ్, అరబిందో ఫార్మా వంటి సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీ దర్యాప్తులున్న జాబితాలో ఉన్నాయి.