భోపాల్, సెప్టెంబర్ 4: అవినీతి, అధికారుల అలసత్వంపై అనేక ఫిర్యాదులు చేసినా, తనకు న్యాయం జరగటం లేదంటూ మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తి వినూత్న నిరసన చేపట్టాడు. వెయ్యి పేజీలతో ఫిర్యాదును రూపొందించిన అతడు, దాన్ని ఒంటికి చుట్టుకొని అర్ధనగ్నంగా మధ్యప్రదేశ్లోని నీమచ్ కలెక్టరేట్ ముందు నిరసనకు దిగాడు. కాకరాయి గ్రామానికి చెందిన ముకేష్ ప్రజాపత్ మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై వినూత్న పద్ధతిలో తన నిరసన వ్యక్తం చేశాడు. ‘ఏడేండ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నా. చెప్పులు నెత్తిన పెట్టుకొని న్యాయం కోసం వేడుకుంటున్నా. నా గోడు సీఎం మోహన్ యాదవ్ వినాలి’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు.