Dera Baba | ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ (Dera Sacha Sauda) చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Rahim Singh) అలియాస్ డేరా బాబా (Dera Baba) మరోసారి జైలు నుంచి బయటకు రానున్నారు. అక్టోబర్ 5వ తేదీన హర్యానా అసెంబ్లీకి (Haryana polls) ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేరా బాబా పెట్టుకున్న పెరోల్ పిటిషన్‌ను ఎన్నికల సంఘం సోమవారం ఆమోదించింది. ఎన్నికల సంఘం ఆమోదం నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఆయన విడుదలకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.
డేరా బాబాకు హర్యానాలో లక్షలాది మంది అనుచరులున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బయటకు వస్తే ఈ ఎన్నికలపై పెను ప్రభావం పడనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పెరోల్ సమయంలో ఆయన హర్యానాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వ్యక్తిగతంగా లేదా సోషల్ మీడియా ద్వారా ఎలాంటి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే వీలుండదని సమాచారం. కాగా, ఎన్నికల సంఘం నిర్ణయంతో డేరా బాబాకు తొమ్మిది నెలల్లో పెరోల్ లభించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇక గత నాలుగేళ్లలో 15వ సారి.
ఇదీ కేసు..
2017లో ఇద్దరు శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారణ అయిన తరువాత కోర్టు అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రెండు అత్యాచారాలకు సంబంధించిన కేసులో దోషిగా శిక్ష అనుభవించడంతో పాటు పలు హత్యల్లో జీవిత ఖైదు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం అతడు హర్యానాలోని రోహ్తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ఆయన వివిధ కారణాలతో పలుమార్లు పెరోల్‌పై బయటకు వస్తున్న విషయం తెలిసిందే.
పెరోల్‌పై పలుమార్లు విడుదల..
గత తొమ్మిది నెలల్లో ఆయనకు మూడుసార్లు పెరోల్ (తాజా పెరోల్తో కలిపి) లభించగా.. నాలుగేళ్లలో మొత్తంగా 15 సార్లు పెరోల్‌పై బయటకు వచ్చాడు. గతేడాది జనవరిలో 40 రోజులు, జులైలో 30 రోజులు, నవంబర్‌లో కూడా 21 రోజులపాటు పెరోల్‌పై బయటకు వచ్చాడు. మొత్తంగా గతేడాది 91 రోజులపాటు ఆయన పెరోల్‌పై బయటే ఉన్నాడు. ఇక ఈ ఏడాది (2024) జనవరిలో కూడా ఆయన దాదాపు 50 రోజుల పాటు పెరోల్‌పై బయటే ఉన్న విషయం తెలిసిందే. ఆగస్టులో కూడా 21 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చారు. ఇప్పుడు మూడోసారి కూడా ఆయనకు పెరోల్ లభించింది. ఇక 2022లో మూడుసార్లు పెరోల్ లభించింది. ఆ ఏడాది ఫిబ్రవరిలో 21 రోజులు, జూన్‌లో (నెలరోజులు), అక్టోబర్‌లో 40 రోజుల పాటు జైలు నుంచి బయటకు వచ్చారు. ఇక 2020, 2021లో కూడా పలుమార్లు అతడికి పెరోల్ లభించింది.
Also Read..
Rajinikanth | నా స్నేహితుడు త్వరగా కోలుకోవాలి.. రజనీకాంత్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్
Visa Appointments: 2.5 లక్షల అదనపు వీసా అపాయింట్మెంట్లు రిలీజ్ చేసిన అమెరికా