న్యూఢిల్లీ, మే 20: విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకొని అక్కడే ఉద్యోగాల్లో స్ధిరపడాలని కలలు కనడం మానండి అని గుర్గావ్కు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త రాజేశ్ సాహ్నీ భారతీయులకు సూచించారు. అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లో అంతర్జాతీయ విద్యార్థులకు జాబ్ మార్కెట్ లేదని, ముఖ్యంగా ఐఐటీ ఇంజినీర్లు ఈ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ఎక్స్‌లో ఆయన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘అమెరికా, బ్రిటన్, కెనడాల్లో అంతర్జాతీయ విద్యార్థులకు ఉద్యోగాల్లేవు. హనీమూన్ అయిపోయింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖరీదైన చదువును ఇప్పించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి’ అని రాజేశ్ హెచ్చరించారు.
‘ఇంజినీరింగ్ విద్యార్థులు ముఖ్యంగా ఐఐటీయన్లు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ సంపాదించి రెండు లక్షల డాలర్ల జీతం వచ్చే ఉద్యోగం సంపాదించవచ్చు అనుకొనేవారు. అది ఇక ఎంతమాత్రం పనిచేయడం లేదు’ అని రాజేశ్ పేర్కొన్నారు. భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో రాజేశ్ సాహ్నీ ఎంతో పేరెన్నికగన్నారు. జీఎస్ఎఫ్ యాక్సెలరేటర్ సంస్థకు వ్యవస్థాపకుడు, ప్రస్తుతం సీఈవో. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఫెలోగా ఉన్నారు. రాజేశ్ పోస్ట్ వైరల్‌గా మారిన నేపథ్యంలో అనేకమంది ఇదే విధమైన అభిప్రాయాలు వ్యక్తంచేశారు. ‘2017లో కోర్సు పూర్తయిన కొద్ది రోజుల్లోనే 1.50 లక్షల డాలర్ల ఉద్యోగం సంపాదించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు గూగుల్ వంటి టాప్ సంస్థలు కూడా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి’ అని ఒక యూజర్ పేర్కొన్నారు.
అమెరికా, బ్రిటన్‌తోపాటు కెనడా కూడా ఇటీవలి కాలంలో వీసా నిబంధనలను కఠినతరం చేసింది. అంతర్జాతీయ విద్యార్థులకు విద్యానంతరం ఉద్యోగం చేసే గడువును ఇటీవలే బ్రిటన్ రెండేండ్ల నుంచి 18 నెలలకు తగ్గించింది. అమెరికా, కెనడా కంపెనీలు సైతం అంతర్జాతీయ విద్యార్థుల కోసం అవకాశాలను తగ్గించివేస్తున్నాయి. బ్రిటన్‌లో మాస్టర్స్ చేసిన జాహ్నవీ జైన్ అనే భారతీయ మహిళ.. 90 శాతం మంది తన సహచర భారతీయ విద్యార్థులు యూకేలో ఉద్యోగ అవకాశాలు లేక భారత్‌కు తిరిగి వెళ్లారని తెలిపారు.